ఆంధ్రా భగత్ సింగ్.. లగడపాటి రాజగోపాల్: జోరుగా ప్రచారం!!

SELVI.M|
FILE
విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్‌ను ఆంధ్రా భగత్ సింగ్ అంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. గురువారం లోకసభలో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)ను ప్రవేశ పెట్టిన సమయంలో లగడపాటి పెప్పర్ స్ప్రే చేసిన విషయం తెలిసిందే. ఇది తీవ్ర దుమారం రేపింది.

లగడపాటి స్ప్రేను తెలంగాణ నేతలతో పాటు పలువురు ఖండిస్తుండగా, సీమాంధ్ర నేతలు దానిని చిన్న విషయంగా చెబుతున్నారు. లగడపాటి పెప్పర్ స్ప్రే నేపథ్యంలో ఆయనను ఆంధ్రా భగత్ సింగ్ అంటూ కొనియాడుతూ ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి.

కుటిల రాజకీయాలు తిప్పికొట్టిన ఆంధ్రా భగత్ సింగ్ అంటూ హోరెత్తిస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం సైలెంట్ రెవెల్యూషన్ తెచ్చిన విజయవాడ వీరుడు సమైక్యాంధ్ర మగధీరుడు, సమైక్యాంధ్ర కోసం పార్లమెంటులో అలుపెరుగని పోరాటం చేస్తున్న ఆంధ్రా భగత్ సింగ్, పార్లమెంటులో పవర్ చూపించిన బెజవాడ బెబ్బులి, కుటిల రాజకీయాలు తిప్పికొట్టిన సమైక్యాంధ్ర బ్రహ్మాస్త్రం, సమైక్యవాదాన్ని వెలుగెత్తి చాటిన కొండపల్లి సింహం, తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలని అలుపెరగని కృషి చేస్తున్న బెజవాడ బ్రహ్మాస్త్రం అంటూ ప్రచారం హోరెత్తుతోంది.

మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సహా పలువురు సీమాంధ్ర నేతలు లగడపాటిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

లగడపాటి మంచి పని చేశారని జగన్ నిన్న చెప్పగా, అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ వారు నిలబెట్టి కాల్చారని, ఆయన చరిత్రలో నిలిచిపోయారని సబ్బం హరి శుక్రవారం లగడపాటి పెప్పర్ స్ప్రేను ఉద్దేశించి అన్నారు. ఇక సమైక్యవాదులు లగడపాటికి మద్దతు పలుకుతున్నారు.


దీనిపై మరింత చదవండి :