వరద బాధిత ప్రాంతాల్లో ప్రధాని నేడు ఏరియల్ సర్వే

PNR| Last Modified శుక్రవారం, 9 అక్టోబరు 2009 (11:18 IST)
వరద బాధిత ప్రాంతాల్లో ప్రధాని మన్మోహన్ సింగ్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేక విమానంలో శుక్రవారం రాష్ట్రానికి రానున్నారు. ఆయన రెండు రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తారు. శుక్ర, శనివారాల్లో ఆయన వరదముంపునకు గురైన జిల్లాల్లో హెలికాఫ్టర్‌లో ఏరియర్ సర్వే చేస్తారు.

ఇందుకోసం ఆయన శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు న్యూఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.25 గంటలకు విజయవాడకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఆర్మీ హెలికాఫ్టర్‌లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి, జరిగిన నష్టాన్ని పరిశీలిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన, అధికారులు వివరించే పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను వింటారు.

రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. మరుసటి రోజు కర్నూలు, కర్ణాటకలోని రాయచూరుల్లో ఏరియల్ సర్వే చేస్తారు. కాగా, మన్మోహన్ ప్రయాణించే బేగంపేట విమానాశ్రయం, రాజ్‌భవన్‌ల మధ్య నగర పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ అధికారులు గురువారమే హైదరాబాద్‌కు చేరుకున్నారు.


దీనిపై మరింత చదవండి :