వరుణ దేవుడు పార్టీ మార్చేశాడు: చిరంజీవి

PNR|
File
FILE
ఐదేళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం పుచ్చుకుని ఉన్న వరుణ దేవుడు.. కాంగ్రెస్ నేతల అరాచకాలను చూసి పార్టీ మార్చేశాడని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఎద్దేవా చేశారు. అందువల్లే ఉత్తర భారతదేశాన్ని వరుణ దేవుడు ముంచెత్తుంటే.. మన రాష్ట్రంలో వర్షం చుక్క పడటం లేదన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని ఇన్నాళ్ళూ చెప్పుకొచ్చిన పాలకులు ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై ఏ సమాధానం చెపుతారన్నారు. బహుశా వరుణ దేవుడు పార్టీ మారి పోయినట్టున్నాడని వ్యాఖ్యానించారు.

గత ఐదేళ్ళ కాలంలో కాంగ్రెస్ పాలకులు చేసిన అరాచకాలను చూసిన వరుణుడు.. మరో ఐదేళ్ళ పాటు వాటిని చూసే ఓపికలేక పార్టీ ఇతర పార్టీల సభ్యత్వం పుచ్చుకున్నట్టుగా ఉన్నాడన్నారు. రాష్ట్రంలో నిత్యావసర ధరలు చుక్కులు తాకుతుంటే.. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం నిద్రమత్తును వీడలేదన్నారు.

బడ్జెట్ విషయానికి వస్తే.. వాస్తవాలను కప్పిపెట్టి మసిపూసి మారేడు కాయ చేసిన విధంగా విత్తమంత్రి రోశయ్య తన చతురతను మేళవించి బడ్జెట్ కేటాయింపులున్నాయని విమర్శించారు. బ్లాక్ మార్కెట్ నియంత్రణ కొరవడిందని, ఫలితంగా ధరలు చుక్కలను తాకుతున్నాయన్నారు.

సంక్షేమ హాస్టళ్ళ పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో ఒక్కో హాస్టల్ విద్యార్థికి రోజుకు 17 రూపాయలు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. ఆర్థిక మాంద్యం పుణ్యమాని చిన్న పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొంటుందన్నారు. నిరుద్యోగ నిర్మూలనకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.


దీనిపై మరింత చదవండి :