గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 7 మార్చి 2021 (11:15 IST)

మ‌హిళ‌ల‌పై దాడుల‌ కేసుల‌కు స‌త్వ‌ర ప‌రిష్కారం: హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి

ఇటీవ‌ల కాలంలో మ‌హిళ‌లపై దాడులు పెరుగుతున్నాయ‌ని, అటువంటి కేసుల‌ను స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించేందుకు ప్ర‌త్యేక మ‌హిళా న్యాయ‌స్థానాలు దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అరుప్‌కుమార్ గోస్వామి అన్నారు. న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేసేందుకు త‌న‌వంతు కృషి చేస్తాన‌ని చెప్పారు.

విజ‌య‌న‌గ‌రంలో నూత‌నంగా ఏర్పాటు చేసిన మ‌హిళా, పోక్సో కోర్టుల‌ను స్థానిక జిల్లా కోర్టు ప్రాంగ‌ణంలో  రాష్ట్ర‌ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అరుప్ గోస్వామి శ‌నివారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో ఆయ‌న‌ మాట్లాడుతూ అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఇప్పుడు ప్ర‌పంచం దృష్టంతా మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల‌పైనే ఉంద‌న్నారు.

ఇలాంటి త‌రుణంలో మ‌హిళా దినోత్స‌వానికి రెండు రోజుల ముందుగా మ‌హిళా న్యాయ‌స్థానాన్ని ప్రారంభించుకోడం సంతోష‌దాయ‌క‌మ‌ని పేర్కొన్నారు. మ‌హిళ‌ల‌ను గౌర‌వించాల్సిన బాధ్య‌త ప్ర‌తీఒక్క‌రిపైనా ఉంద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ, ఇటీవ‌ల కాలంలో మ‌హిళ‌లు, పిల్ల‌ల‌పై దాడులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇలాంటి ప్ర‌త్యేక కోర్టుల ద్వారా అటువంటి కేసులు త్వ‌ర‌గా ప‌రిష్కార‌మ‌వుతాయ‌న్నారు.

తాను రాష్ట్ర‌ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా రెండు నెల‌ల క్రితం బాధ్య‌త‌లు చేప‌ట్టిన ద‌గ్గ‌ర ‌నుంచి న్యాయ‌స్థానాల్లోని స‌మ‌స్య‌ల‌ను ప‌రిశీలించ‌డం జ‌రుగుతోంద‌ని, వాటిని ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని న్యాయ‌మూర్తి గోస్వామి హామీ ఇచ్చారు.

కార్య‌క్ర‌మానికి హాజ‌రైన హైకోర్టు న్యాయ‌మూర్తి, జిల్లాకు చెందిన‌ జ‌స్టిస్ సిహెచ్ మాన‌వేంద్ర‌నాథ్‌రాయ్ మాట్లాడుతూ విజ‌య‌న‌గ‌రం జిల్లా న్యాయ‌స్థానంలోని స‌మ‌స్య‌ల‌ను, జిల్లా భౌగోళిక‌, ఆర్థిక ప‌రిస్థితుల‌ను వివ‌రించారు.  ఆర్థికంగా, విద్యాప‌రంగా జిల్లా వెనుక‌బ‌డిన‌ప్ప‌టికీ, జిల్లా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఏడుగురు న్యాయ‌మూర్తులు హైకోర్టులో విధుల‌ను నిర్వ‌హించ‌డం, జిల్లాకు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు.

వీరిలో ఐదుగురు న్యాయ‌మూర్తులు, తాను ప్రాతినిధ్యం వ‌హించిన పార్వ‌తీపురం బార్ అసోసియేష‌న్ నుంచే రావ‌డం మ‌రింత సంతోష‌దాయ‌క‌మ‌ని అన్నారు. జిల్లాకు అడిష‌న‌ల్ సీనియ‌ర్ సివిల్ జ‌డ్జి కోర్టు కావాల్సి ఉంద‌ని, అదేవిధంగా  జిల్లా కోర్టుకు కొత్త భ‌వ‌న‌ సముదాయాన్ని మంజూరు చేయాల‌ని ప్ర‌ధాన‌ న్యాయ‌మూర్తిని కోరారు. 

స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించిన హైకోర్టు న్యాయ‌మూర్తి, జిల్లా పోర్టుపోలియో జ‌డ్జి, జ‌స్టిస్ బ‌ట్టు దేవానంద్ మాట్లాడుతూ,  చారిత్ర‌క న‌గ‌ర‌మైన విజ‌య‌న‌గ‌రంలో దాదాపు 30 ఏళ్లు త‌రువాత రాష్ట్ర ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ప‌ర్య‌టించ‌డం సంతోషంగా ఉంద‌ని అన్నారు. ప్ర‌త్యేకంగా మ‌హిళా, పోక్సో కోర్టుల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా, కేసులు త్వ‌ర‌గా పరిష్కారమై, బాధితుల‌కు స‌త్వ‌ర‌మే న్యాయం జ‌రుగుతుంద‌ని అన్నారు.

స్త్రీలు ఎక్క‌డ పూజింప‌బ‌డ‌తారో, అక్క‌డ దేవ‌త‌లు సంచ‌రిస్తార‌న్న నానుడి ఉంద‌ని, దానికి ఈ ప్ర‌త్యేక న్యాయ‌స్థానం దోహ‌దం చేస్తుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.  జిల్లా ప్రిన్సిప‌ల్‌, సెష‌న్స్ జ‌డ్జి గుట్ట‌ల గోపి మాట్లాడుతూ, రాష్ట్ర హైకోర్టు న్యాయ‌మూర్తి జిల్లాలో ప‌ర్య‌టించ‌డం చిర‌స్మ‌ర‌ణీయ‌ఘ‌ట్ట‌మ‌ని పేర్కొన్నారు.

హైకోర్టు ప్ర‌ధాన‌ న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత‌, రాష్ట్రంలోనే తొలిసారిగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప‌ర్య‌టించినందుకు ఆయ‌న‌ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఒక్కో కోర్టుకు సంబంధించి  సుమారు 250 వ‌ర‌కూ కేసులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని, ప్ర‌త్యేక కోర్టుల ద్వారా అవి త్వ‌ర‌గా ప‌రిష్క‌రించేందుకు వీల‌వుతుంద‌న్నారు.

జిల్లా బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు బి.సంజీవ‌రావు మాట్లాడుతూ జిల్లాలోని న్యాయ‌వాదుల స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు. జిల్లా న్యాయ‌స్థానానికి కొత్త భ‌వ‌నాన్ని మంజూరు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అనంత‌రం న్యాయ‌మూర్తుల‌ను ఘ‌నంగా స‌త్క‌రించారు. కార్య‌క్ర‌మంలో ప‌లువురు జిల్లా న్యాయ‌మూర్తులు, పెద్ద సంఖ్య‌లో న్యాయ‌వాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.