తెదేపా తమ్ముడికి షాక్, పదవి కోసం పెళ్లి చేసుకుంటే గాజు గ్లాసుకి అంకితం
ఇటీవలే సోషల్ మీడియాలో విపరీతంగా ఓ తెదేపా తమ్ముడి పెళ్లి వైరల్ అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకి చెందిన తెదేపా యువనేత, మాజీ కౌన్సిలర్ హర్షవర్థన్ ఈమారు ఎలాగైనా మునిసిపల్ చైర్మన్ కావాలని గట్టి ప్రయత్నమే చేసారు. సాలూరు మున్సిపల్ చైర్మన్ స్థానం ఊహించని విధంగా బీసీ మహిళకు రిజర్వ్ అయిపోయింది. దీనితో తను ప్రేమించిన యువతి మంజీరను హడావుడిగా వివాహం చేసుకున్నాడు. పెళ్లితో తన భార్యకు ఆ సీట్ ఖాయం అనుకున్నాడు.
ఐతే ఆ ఆశ కాస్త అడియాశ అయ్యింది. కూటమి సీట్ల సర్దుబాటులో ఈ స్థానాన్ని కాస్తా జనసేన గాజు గ్లాసు తన్నుకెళ్లింది. మరో 8 నెలల తర్వాత ధూంధాంగా పెళ్లి చేసుకోవాలనుకున్నా... మునిసిపల్ చైర్మన్ పోస్ట్ కోసం అతి సామాన్యంగా పెళ్లి చేసుకున్నా ఫలితం దక్కలేదు. దీనితో హర్షవర్థన్-మంజీర కొత్త జంట ఒకింత నిరాశకు లోనయ్యారు. ఐతే రాజకీయాల్లో ఇవన్నీ సహజమే... ఇప్పటికి పదవి రాకపోయినా పార్టీ సముచిత స్థానం ఇస్తుందన్న నమ్మకంతో వున్నారట హర్షవర్థన్.

