శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 3 మార్చి 2016 (16:06 IST)

సిగ్గు.. లజ్జా.. చీము.. నెత్తురు ఉంటే.. ఉరవకొండకు రా: పయ్యావులకు అంబటి సవాల్

తెలుగుదేశం పార్టీ సీనియర్, ఎమ్మెల్సీ నేత పయ్యావుల కేశవ్‌పై వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి సొంత పత్రిక సాక్షిలో రాజధాని భూదందాపై వరుసగా ప్రచురిస్తున్న కథనాలను ఆధారంగా చేసుకుని పయ్యావుల కేశవ్.. జగన్‌కు బహిరంగ సవాల్ విసిరారు. తప్పుడు రాతలు రాయడంమాని.. బహిరంగ చర్చకు ప్రకాశం బ్యారేజీ వద్దకు రావాలంటూ సవాల్ విసిరారు. 
 
దీనిపై అంబటి రాంబాబు గురువారం మీడియా సమావేశంలో స్పందించారు. తాను బినామీ పేర్లతో కొనలేదని, మగాడిలా తన కొడుకు పేరుమీదే భూమి కొన్నానని పయ్యావుల కేశవ్ చెప్పడంపై ఆయన మండిపడ్డారు. మీరు మగాడిలా కొంటే.. మరి బినామీ పేర్లతో కొన్న చంద్రబాబు, లోకేష్, నారాయణల పరిస్థితేంటి.. వాళ్లు మగాళ్లు కారా అని ప్రశ్నించారు. మగాడిలా కొన్నానంటున్నావే.. రావెల కిశోర్ బాబు భార్య కూడా డైరెక్టుగా నీలాగే కొన్నారని ఆయన అన్నారు. రాజధాని భూదందాలో ఈ నేతల పాత్రలు బయటకు వస్తుండటంతో రంకెలు వేస్తున్నారంటూ అంబటి ఆరోపించారు. 
 
అంతేనా... ఇకమీదట ఈ కథనాలు రాయొద్దంటూ రాత్రి 11 గంటల వరకు సాక్షిలో స్ట్రింగర్ నుంచి వాచ్‌మన్ వరకు అందరి దగ్గరకు కాళ్ల బేరానికి వచ్చిన మాట వాస్తవమా కాదా అని అంబటి రాంబాబు కేశవ్‌ను ప్రశ్నించారు. అలాగే బినామీ ఆస్తులపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నట్టు అంబటి రాంబాబు ప్రకటించారు. అసలు అక్కడ ఎందుకుకొన్నారు.. రాజధాని వస్తోందని ముందే తెలిసి కొన్న మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. ఆ విషయం చెప్పకుండా జగన్ మీద ఆరోపణలు చేయడం, నిందలు వేయడం ఎందుకని నిలదీశారు.
 
ఇప్పుడు పయ్యావుల కొత్త పల్లవి అందుకుంటున్నారని, ఇప్పటివరకు సీబీఐ దృష్టికి రాని కొన్ని వాస్తవాలను వాళ్లు బయటకు తీస్తామంటున్నారని, కడపలో ఉన్న బినామీ మైనింగులను కూడా తీస్తామని చెబుతున్నారని.. మరి ఇన్నాళ్లూ గాడిదలు కాస్తున్నారా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎందుకు బయటకు తేలేదు? ఇన్నాళ్లూ ఎందుకు దాచావు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా పయ్యావుల కేశవ్ గారూ అని నిలదీశారు. కేవలం వాళ్ల మీద వార్త వచ్చింది కదాని బెంబేలెత్తిపోతున్నారన్నారు. అన్నీ బయటపడ్డాక ప్రకాశం బ్యారేజి మీదకు వస్తారో, పట్టిసీమకు వస్తారో చర్చకు తాము సిద్ధమన్నారు. 
 
అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతానన్న చంద్రబాబు ఇప్పుడు లింగమనేని వారు అక్రమంగా కట్టిన అవినీతి బంగ్లాలో నిద్రపోతున్నారని, టీడీపీ నేతలు అంతా సిగ్గుమాలిన పనులు చేస్తూ, నిప్పుతొక్కిన కోతుల్లా వ్యవహరిస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై విచారణ ఎదుర్కోడానికి సిద్ధం కావాలి తప్ప జగన్ మోహన్ రెడ్డి మీద బురద చల్లి తప్పుకోవాలని చూడొద్దని అంబటి రాంబాబు హితవు పలికారు.