డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు : అజ్ఞాతం వీడిన అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ
గత వైకాపా ప్రభుత్వంలో సంచలనం సృష్టించిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి లక్ష్మీదుర్గ ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. ఈ కేసులో రెండో నిందితురాలిగా ఉన్న అమెపై రాజమండ్రి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీచేసింది. దీంతో రక్షణ కోసం ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హైకోర్టు షరతులతో కూడిన వెసులుబాటు కల్పించింది. ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు ప్రతి రోజూ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఎదుట హాజరై విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో ఆమె సోమవారం అజ్ఞాతం వీడి సిట్ ముందుకు వచ్చారు.
పైగా, హత్య జరిగిన సమయంలో తాను ఘటనా స్థలంలో లేనని, బంధువులను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లానని లక్ష్మీదుర్గ గతంలో పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. కానీ, సాంకేతిక ఆధారాలు, ముఖ్యంగా, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన సిట్ అధికారులు ఆమె చెప్పేవన్నీ అబద్దాలని తేల్చారు.
హత్య జరిగిన రాత్రి ఆమె అనంతబాబుతోనే కలిసే ఉన్నట్టు, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసే సమయంలో కూడా ఆమె పాత్ర ఉన్నట్టు ఫోరెన్సిక్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెను నిందితురాలిగా చేరుస్తూ అనుబంధ చార్జిషీటును దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో ఆమె సోమవారం విచారణకు హాజరయ్యారు.