గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 నవంబరు 2015 (09:11 IST)

బీహార్ ఫలితాల్లో ఆంధ్రా అక్టోపస్ చెప్పిందే జరిగింది.. ఎలా?

ఆంధ్రా అక్టోపస్ అంటే ఎవరో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. గత సార్వత్రి ఎన్నికల్లో ఆయన చెప్పినట్టుగానే ఫలితాలు వెలుపడ్డాయి. అలాగే, ఇపుడు కూడా బీహార్ అసెంబ్లీ ఫలితాలు కూడా అచ్చం అలాగే వచ్చాయి. దీంతో ఆ ఆక్టోపస్ జోతిష్యంపై మరింత గట్టినమ్మకం ఏర్పడింది. ఆ ఆంధ్రా అక్టోపస్ ఎవరో కాదు.. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. బీహార్ ఎన్నికల ఫలితాలపై ఆయన చెప్పిందే జరిగింది. బీహార్‌లో జేడీయూ నేత నితీశ్ కుమార్‌ సారథ్యంలోని మహా కూటమియే అధికారంలోకి వచ్చింది. 
 
ఎన్నికల ఫలితాలపై సర్వే చేసి ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వడంలో దిట్ట అయిన లగడపాటి.. ఏలూరుకు చెందిన ఆర్జీ ప్లాష్‌ టీమ్‌ ఆధ్వర్యంలో జరిపిన సర్వేలో నిజానికి మొదట మహాకూటమికి 160 సీట్లకు పైగా వస్తాయని అంచనాకు వచ్చామనీ, అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వచ్చిన జనాన్ని చూసి కొంత సీట్ల సంఖ్యను తగ్గించినట్లు తెలిపారు. ఏదేమైనా మహాకూటమికి విజయం తధ్యమన్న విషయం మొదటి దశ పోలింగ్‌ అనంతరం మరింత స్పష్టమైందని చెప్పారు. 
 
కమలనాథులు.. ఈ ఎన్నికల్లో స్థానిక నేతలను పట్టించుకోకపోవడం, నితీశ్‌ పాజిటివ్‌ ఇమేజ్‌పైన దెబ్బ కొట్టాలని చూడటంతో పాటు రిజర్వేషన్లను పునఃసమీక్షించాలన్న ఆర్‌ఎస్ఎస్‌ ఛీప్‌ భగవత్‌ వ్యాఖ్యల వల్ల బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. నితీశ్‌ హయాంలో శాంతి భద్రతల సమస్యలు లేవనీ, మహిళలకు అన్ని విధాలా రక్షణ కల్పించారని, స్కూల్‌ పిల్లలకు సైకిళ్ల పంపిణీ కూడా నితీశ్‌ కూటమి విజయానికి దోహదపడ్డాయని లగడపాటి వివరించారు. 
 
గతంలో యూపీ ఎన్నికల ఫలితాలపై సర్వే చేశామని, బీహార్‌లో మొదటిసారి సర్వే చేయడంతో మంచి అనుభవం వచ్చిందన్నారు. మోడీ సభలకు పెద్ద సంఖ్యలో జనం హాజరైనా ఓట్లు రాకపోవడానికి కారణం స్థానిక స్థానిక బీజేపీ నేతలను పట్టించుకోకపోవడమేనని, పైగా.. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించక మోడీ హవాను ఓట్ల రూపంలో మార్చుకోవడంలో క్రిందిస్థాయి నాయకత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీదే హవా అని అందరికన్నా ముందే చెప్పిన సంగతి తెలిసిందే.