నేపాల్ సరిహద్దుల్లో మనీ డెన్ కీపర్ ప్రణయ్ ప్రకాశ్ అరెస్టు
ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారుల్లో ఒకరిగా భావిస్తున్న కట్టా ప్రణయ్ ప్రకాశ్‍ను సిట్ అధికారులు నేపాల్ సరిహద్దుల్లోని సోనౌలీ చెక్ పోస్టు వద్ద అరెస్టు చేశారు. గత వైకాపా ప్రభుత్వం జరిగిన ఈ స్కామ్‌లో ప్రణయ్ ప్రకాశ్ ఏ-52 నిందితుడుగా ఉన్నారు. లుక్ ఔట్ నోటీసులు జారీ కావడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించగా, పక్కా సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత స్థానిక మహారాజ్ గంజ్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తరలిస్తున్నారు. మద్యం స్కామ్‌లో వచ్చిన డబ్బును ఓ ఇంటిలో భద్రపరిచారు. ఈ మనీ డెన్‌కు ప్రణయ్ ప్రకాష్ కీపర్‌గా వ్యవహరించారు.
ఇపుడు ఈ కీపర్‌ను అరెస్టు చేయడంతో ఈ స్కామ్‌లోని మనీ లాండరింగ్ కోణంపై మరిన్ని ఆధారాలు లభించే అవకాశం కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును భద్రపరచడం, రవాణా చేయడంతో ప్రణయ్ ప్రకాశ్ అత్యంత కీలక పాత్ర పోషించినట్టు సిట్ ఇప్పటికే గుర్తించింది. ప్రణయ్ అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు అయిన వారి సంఖ్య 17కు చేరింది.
కాగా, ఇదే కేసులో తాజాగా ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి (ఏ2), ముప్పిడి అవినాశ్ రెడ్డి (ఏ7) వంటి కీలక నిందితులను అరెస్టు చేసిన సంగతి తెల్సిందే. నిందితుడు ప్రణయ్‌ను విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. కాగా ఏపీలో సంచలనం సృష్టించిన ఈ స్కామ్ వెనుక మరికొందరు పెద్దల హస్తం ఉన్నట్టు సిట్ ఆది నుంచి భావిస్తోంది. ఇపుడు ఆ పెద్దలను గుర్తించేందుకు ప్రణయ్ ప్రకాశ్ వద్ద విచారించనున్నారు.