గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 జనవరి 2026 (21:50 IST)

చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్.. సజ్జనార్, అనిత కితాబు (video)

woman cop
woman cop
ఓ మహిళా కానిస్టేబుల్ పోలీసులకు ఆదర్శంగా నిలిచారు. ఉద్యోగం లేదా బాధ్యత రెండింటిని సక్రమంగా నిర్వర్తిస్తూ అందరి వద్ద ప్రశంసలు అందుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రంగంపేట పోలీస్ స్టేషన్‌లో ఆమదాల జయశాంతి కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త సైతం గుంటూరు ప్రాంతంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నట్లుగా సమాచారం. 
 
ఈ కానిస్టేబుల్ దంపతులకు జన్మించిన బిడ్డ చిన్నవాడు కావడంతో ఇంటి దగ్గరే ఆయాతో మంచి చెడ్డలు చూసుకునే విధంగా కాకినాడలో దంపతులిద్దరూ ఏర్పాటు చేసి ఎవరి ఉద్యోగాలకు వారు వెళ్లి తిరిగి మరలా ఇంటికి వస్తూ ఉంటారు. ఇలాంటి తరుణంలో పండుగ సెలవులు నేపథ్యంలో ఆయా సెలవు పెట్టడంతో డ్యూటీకి మహిళా కానిస్టేబుల్ అయిన ఆమదాల జయశాంతి వెళ్లేటప్పుడే తనబిడ్డను తీసుకుని రంగంపేట పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. 
 
ఆ రోజంతా విధులకు హాజరై తిరిగి మరల సాయంత్రం వారు ఉంటున్న కాకినాడకు రంగంపేట పోలీస్ స్టేషన్ నుంచి లిఫ్ట్ ద్వారా ఒకరి కారు సహాయంతో మహిళా కానిస్టేబుల్ బిడ్డతో కలిసి ప్రయాణమయ్యారు. సరిగ్గా సామర్లకోట ఏడిబి రోడ్డుకు వీరి వాహనం వచ్చేసరికి భారీ ట్రాఫిక్ సమస్య తలెత్తింది. 
 
అదే సమయంలో అంబులెన్స్ సైతం ఆ ట్రాఫిక్‌లో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి తరుణంలో లిఫ్ట్ ఇచ్చిన కారులోంచి మహిళా కానిస్టేబుల్ తనఒళ్ళో కూర్చొన్న బిడ్డను చంకన పెట్టుకుని రోడ్ ఎక్కారు. కటికచీకటి గడ్డచలిగాలి అయినప్పటికీ ట్రాఫిక్ క్లియర్ చేయడంలో నిబద్ధతతో పనిచేశారు. 15 నిమిషాల్లో ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. 
 
అదే సమయంలో అటుగా వెళుతున్న కొందరు చంటి బిడ్డను చంకనేసుకుని మహిళా కానిస్టేబుల్ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న దృశ్యాలను వారి ఫోన్లలో బంధించారు. నిజానికి ఈ ట్రాఫిక్ సమస్య తలెత్తిన ప్రాంతం మహిళా కానిస్టేబుల్ అయినా ఆమదాల జయశాంతి లిమిట్స్ కాదు. అయినా మహిళా కానిస్టేబుల్ చంటి బిడ్డని వేసుకుని ట్రాఫిక్ క్లియర్ చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇక చంటి బిడ్డతో డ్యూటీ చేసిన జయశాంతిని సీపీ సజ్జనార్ ప్రశంసించారు. మరోవైపు కాకినాడ-సామర్లకోట రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, సంకల్లో చంటి బిడ్డను పెట్టుకుని ట్రాఫిక్ క్లియర్ చేసిన లేడి కానిస్టేబుల్‌ జయశాంతికు ఫోన్ చేసి హోం మంత్రి అనిత కొనియాడారు.