మంగళవారం, 21 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 మార్చి 2026 (17:34 IST)

వైకాపా సభ్యులు సభ నుంచి పారిపోతూ జీతాలు తీసుకుంటున్నారు... జగన్ మాత్రం... : స్పీకర్ అయన్న

Ayyanna Patrudu
ఏపీ శాసనసభ సమావేశాలకు వైకాపా సభ్యులు హాజరుకాకుండా పారిపోతూ జీతాలు మాత్రం తీసుకుంటున్నారని, కానీ, వాళ్ల పార్టీకి చెందిన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం జీతం తీసుకోవడం లేదని స్పీకర్ సీహెచ్.అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైకాపా సభ్యులు గైర్హాజరుపై స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యల గురించి గళం విప్పుతారని ఓట్లు వేసి గెలిపిస్తే సభకు రాకుండా పారిపోవడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని మండిపడ్డారు. సభకు హాజరుకాకుండా కేవలం బయట ఉంటూ వేతనాలు తీసుకోవడం అనైతికంగా సరికాదన్నారు. వైకాపా సభ్యులంతా జీతాలు తీసుకుంటున్నారని, కాన, వైకాపా అధ్యక్షుడు జగన్ మాత్రం జీతం తీసుకోవడం లేదని చెప్పారు. 
 
కేవలం గవర్నర్ ప్రసంగం రోజున సభకు వచ్చి కాసేపు నిరసన తెలిపి వెళ్లినంత మాత్రాన అది పూర్తిస్థాయి హాజరు అనిపించుకోదని స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం వరుసగా 65 రోజుల పాటు సభకు అనుమతి లేకుండా హాజరుకాకపోతే ఆ సభ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, వారికి నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. 
 
ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ప్రజా ప్రతినిధులను రీకాల్ చేసే హక్కు ప్రజలకు ఉండాలని దీనిపై చట్ట సవరణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్య కేవలం ఏపీకే పరిమితం కాదని, దేశ వ్యాప్తంగా చట్ట సభల గౌరవాన్ని కాపాడటానికి లోక్‌సభ స్పీకర్‌ను కలిసి చర్చిస్తానని అయ్యన్నపాత్రుడు తెలిపారు. 
 
తెలంగాణ మహిళలకు శుభవార్త : హెల్త్ మిషన్-100 పేరుతో ఆరోగ్య పరీక్షలు 
 
మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హెల్త్ మిషన్ 100 పేరుతో మహిళలకు వివిధ రకాలైన ఆరోగ్య పరీక్షలు చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహా వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలు, పిల్లలు, వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ అత్యాధునిక డయాగ్నస్టిక్ సేవలను నేరుగా పేదల ముంగిటకే చేర్చడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ హెల్త్ స్క్రీనింగ్ ప్రక్రియను రాబోయే ఆరు నెలల పాటు నిరంతరాయంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఈ డయాగ్నస్టిక్ నెట్‌వర్క్ ద్వారా ప్రతిమహిళకు సుమారు 30 రకాల కీలకమైన వైద్య పరీలను పూర్తి ఉచితంగా నిర్వహించనున్నారు. సాధారణ రక్ష పరీక్షలతో పాటు మహిళలను వేధిస్తున్న కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ముందుగా గుర్తించేందుకు ప్రత్యేకంగా కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను కూడా ఇందులో చేర్చడం గమనార్హం. ఈ మొత్తం ప్రక్రియను నాలుగు దేశల్లో విభజించి, ఆరు నెలల కాలపరిమితిలోగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 
 
పరీక్షలతో పాటు ప్రతి లబ్దిదారునికి ఒక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను ప్రభుత్వం రూపొందిస్తుంది. దీనివల్ల భవిష్యత్‌లో అత్యవసర చికిత్స అవసరమైనపుడు వారి వైద్య చరిత్ర ఆన్‌లైన్‍‌లో అందుబాటులో ఉండి, సకాలంలో సరైన చికిత్స అందించేందుకు వీలవుతుంది. వీటితో పాటు రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధులపై అవగాహన, పాలీ క్లినిక్‌ల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ఈ 100 రోజుల మిషన్‌లో అంతర్భాగం చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమం తెలంగాణ మహిళా లోకానికి ఒక బలమైన ఆరోగ్య రక్షణ కవచంలా నిలుస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహా ఆశాభావం వ్యక్తం చేశారు.