మంత్రి పదవులు ముఖ్యం కాదు.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తమకు మంత్రి పదవులు ముఖ్యం కాదని.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. చంద్రబాబు జీవితంలో ప్రజల కోసమే రాజీపడతానని, స్వార్థ రాజకీయాల కోసం రాజీపడే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనతో కష్టాల్లో ఉన్నామని.. ప్రజల సంక్షేమం కోసం ఎక్కడా రాజీపడకుండా పనిచేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని ఎ-1 కన్వెన్షన్ సెంటర్‌లో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలను సుఖపెట్టేందుకు కష్టపడేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు బీమా పథకాన్ని ప్రారంభించారు. కోటి 50లక్షల మంది అసంఘటిత కార్మికులకు బీమా పథకం వర్తింపచేయనున్నారు.
విభజన మనం కోరుకున్నది కాదు.. అన్ని అన్ని రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకు కేంద్రం చేయూత ఇవ్వాలని కోరారు. ఇబ్బందులున్నా.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చంద్రబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి సుజనాచౌదరితో పాటు, పలువురు రాష్ట్రమంత్రులు, కార్మికశాఖ అధికారులు పాల్గొన్నారు.