రూ.2 కోట్లు విరాళమిచ్చిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు దానం చేశారు. అయితే, ఈ దఫా ఆయన తన సొంత పార్టీకి రూ.2 కోట్ల విరాళం ఇచ్చి పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఇందులో ఆయన రూ.2 కోట్లు విరాళం అందించిన తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారు తమకు ముఖ్యమన్నారు. జనసేన భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని.. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. అలా ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకునేవారిని ఉద్యమిగా పిలుస్తామన్నారు.
అలాగే, పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి, నవతరంలో ప్రేరణ కలిగించేవారిని సాధక్‌గా.. ప్రజా, రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమవంతు సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేథా సహాయ సహకారాలు అందించేవారిని ప్రదాతగా వ్యవహరిస్తామన్నారు.
ఒకపుడు 150 మందితో పార్టీని ప్రారంభించామని, 2021లో మొదటి విడత 90 వేల క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేశాం. ఎన్నికలకు ముందు ఆ సంఖ్య 6 లక్షలు.. ఆ తర్వాత 12.98 లక్షలకు చేరిందని, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారి నుంచి చదువుకున్న ఎంతోమంది ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారని పవన్ కళ్యాణ్ అన్నారు.