1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP Deputy CM Pawan Kalyan Criticizes Congress Leaders for Stoking Regional Tension

హైదరాబాద్‌కు రావొద్దంటే.. రాహుల్‌‌కు దక్షిణాదిలో ఏంపని? పవన్ కళ్యాణ్ ప్రశ్న

pawan kalyan
తనను హైదరాబాద్ రావొద్దంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి దక్షిణాదిలో ఏం పని అని పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు. ఆయన ఢిల్లీలో ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ నగరం ఎవరి సొత్తూ కాదన్నారు. తనను హైదరాబాద్ నగరానికి రావొద్దంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి దక్షిణాదిపై హక్కు లేదని చెప్పాల్సి వస్తుందన్నారు. ప్రాంతీయ  పేరుతో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. 
 
దేశంలోని ప్రతి పౌరుడికి ఎక్కడైనా వెళ్లే హక్కు ఉందన్నారు. తనను తెలంగాణాకు రావొద్దు అనడం తన ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడమే అని అన్నారు. పైగా, తెలంగాణాకు రావొద్దని అంటే దానికి ప్రతిగా కౌంటర్ ఇచ్చేచర్యలో భాగంగానే తెలంగాణ ఎవరు జాగీర్ కాదని అన్నానని, తెలంగాణ రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేకం కాదన్నారు. కానీ, ఏపీని ముక్కలు చేసిన తీరును తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిపారు. 
 
గతంలో కొందరు నేతలు తనను హైదరాబాద్ నగరానికి రావొద్దని అన్నారని, అదే తర్కాన్ని పాటిస్తే రాహుల్ గాంధీ వంటి జాతీయ నాయకులు కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్లవద్దని చెప్పాల్సి వుంటుందన్నారు. ఇటువంటి సంకుచిత భావాలు దేశ రాజకీయాలకు ఏమాత్రం మంచిదికాదన్నారు. 
 
అలాగే, ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ధోరణులు దేశ సమగ్రతకు అత్యంత ప్రమాదకరమన్నారు. ఇలాంటి విభజనవాద ధోరణులు దేశ శ్రేయస్సుకు ఏమాత్రం మంచిది కాదన్నారు. ముఖ్యంగా, రాజ్యాంగ పదవుల్లో ఉండేవారు ఒక ప్రాంతాన్ని మరో ప్రాంతంతో పోల్చి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడం ఏమాత్రం సబబు కాదని హితవు పలికారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
పురుషుల మృతదేహాల వ్యక్తిగత భాగాలపై మహిళా డాక్టర్ వ్యాఖ్యలు