జగన్ మతంలో జరిగివుంటే ఇలాగే స్పందించేవారా? పవన్ కళ్యాణ్
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో పరకామణిలో జరిగిన చోరీని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చిన్న చోరీ అంటూ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన బుధవారం అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ వైకాపా హయాంలో తిరుమలలో భారీగా అవినీతి జరిగిందన్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం పూర్తి విచారణకు ఆదేశించిందన్నారు. పరకామణి చోరీలాంటి ఘటన జగన్మోహన్ రెడ్డి మతంలో జరిగివుంటే ఆయన ఇలాగే స్పందించేవారా అని పవన్ సూటిగా ప్రశ్నించారు. ఇస్లాం, క్రైస్తవ మతాలకు ఒకరు, హిందూ మతానికి మరోలా నిబంధనలు ఉండవని స్పష్టం చేశారు.
వైకాపా హయాంలో తిరుమలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆ అక్రమాలన్నీ ఇపుడు బయటపడుతున్నాయని అన్నారు. ఇటీవల పట్టు శాలువాల పేరుతో పాలిస్టర్ వస్త్రాలు సరఫరా చేసిన స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చిందన్నారు. ఇలాంటి అక్రమాలన్నింటిపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని తెలిపారు.
ఈ సందర్భంగా హిందూ సమాజంపై జరుగుతున్న వివక్ష గురించి పవన్ స్పందించారు. హిందువులు మెజార్టీ అనడం ఒక భ్రమ. కులం, మతం, భాష, ప్రాంతాల వారిగా హిందువులు విడిపోయారు అని పవన్ గుర్తు చేశారు. హిందుత్వంపై విమర్శలు చేస్తే సెక్యులరిజం అంటారని, అదే ఇతర మతాలపై వ్యాఖ్యలు చేస్తే ఆయా మతాల వారంతా ఏకమవుతారని అన్నారు. తమిళనాడులో ఓ న్యాయమూర్త హిందూ సమాజ హక్కులను కాపాడేలా తీర్పు ఇస్తే, డీఎంకే ప్రభుత్వం ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడాన్ని పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు.