శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండుగే : పవన్ కళ్యాణ్
శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండగేనని ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలు సంక్రాంతి శోభతో కళకళలాడుతున్నాయన్నారు.
ఈ పండుగ అనగానే మన మదిలో మెదిలేది భోగిమంటలు, గంగిరెద్దులు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, సంప్రదాయ పందేలు, కొత్తదుస్తులు, పిండి వంటలేనని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో ఏపీ అంతటా ప్రశాంతత వెల్లివిరుస్తోందన్న సంగతిని వేరే ప్రస్తావించవలసిన అవసరం లేనేలేదన్నారు.
'శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండుగే. ఇలాంటి తరుణంలో జరుగుతున్న ఈ సంక్రాంతితో ప్రతి ఇల్లూ సౌభాగ్యంతో విలసిల్లాలని కోరుకుంటున్నాను. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణ పుణ్యాన్ని ప్రసాదించే ఈ పండుగ తెలుగువారందరికీ సర్వైశ్వర్యం ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నాను' అని పవన్ వ్యాఖ్యానించారు.