గురువారం, 12 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 ఫిబ్రవరి 2026 (16:51 IST)

కల్తీ లడ్డూ వివాదంలో నివ్వెరపోయే నిజాలు : మంత్రి పయ్యావుల కేశవ్

payyavula
తిరుమల తిరుపతి కల్తీ లడ్డూ వ్యవహారంలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షత ఏపీ మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాత మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ, తిరుమల లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరుగుతోందని తెలిసినా గత వైకాపా పాలకులు మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022లో వైకాపా హయాంలో వచ్చిన సీఎఫ్‌టీఆర్‌ నివేదికను కావాలనే తొక్కిపెట్టారని మండిపడ్డారు. నిబంధనలు సడలించి మరీ అక్రమాలకు గేట్లు తెరిచారని ఆరోపించారు. 
 
ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినందున రిపోర్టులో ఉన్నవారందరికీ నేరంలో భాగం ఉందని అభిప్రాయపడ్డారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయాలని క్యాబినెట్‌ నిర్ణయించినట్టు చెప్పారు. తిరుమలలో ఇన్ని తప్పులు జరుగుతుంటే గత ప్రభుత్వ పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారని పయ్యావుల ప్రశ్నించారు. ఈ తప్పుల్లో వారు భాగస్వాములుగా ఉన్నారని ఆధారాలు చెబుతున్నాయన్నారు. 
 
'సీఎఫ్‌టీఆర్‌ఐ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నివేదిక సూచనల మేరకు చర్యలు తీసుకోని వారిని ఏమనాలి? కల్తీ నిర్ధారణ పరీక్ష వద్దనగానే సడలింపు ఇవ్వటం నేరాన్ని ప్రోత్సహించటమే. ఏ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మాట్లాడారో గ్రహించాలి. లడ్డూల్లో కొబ్బరి, పందికొవ్వు, పామాయిల్‌, ఫిష్‌ ఆయిల్‌ ఉన్నట్టు ఎన్‌డీడీబీ నివేదిక ఇచ్చింది. ల్యాబ్‌ నివేదికలోని సమాచారం ప్రకారమే సీఎం మాట్లాడారు. తెలిసిన వాస్తవాలను సీఎం ప్రజల ముందు పెట్టాలా? వద్దా? తితిదే ప్రక్షాళనలో భాగంగా ఈవోగా శ్యామలరావును నియమించారు. నమూనాలను సీఎఫ్‌టీఆర్‌ఐకి అప్పటి ఈవో పంపించారు. 
 
2022లో నివేదిక ఇస్తే దాన్ని సరిచేయకుండా ముందుకెళ్లారు. పాలసేకరణలో 3 నిబంధనలు పెట్టారు. 4లక్షల లీటర్ల పాలు సేకరించే సంస్థగా ఉండాలని నిబంధన ఉంది. సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న భోలే బాబా డెయిరీకి వెళ్లారు. నకిలీ పత్రాలతో టెండర్లలో పాల్గొన్నారని తెలిసినా మౌనం వహించారు. చుక్కపాలు లేకుండా నెయ్యి చేయడంపై ప్రజల్లో చర్చ జరగాలి. నేరంలో భాగస్వాములపై చర్యలు తీసుకునేందుకే విచారణ కమిషన్‌. బ్రిటీష్‌ పాలకులు, నిజాం కూడా తిరుమల వ్యవస్థలోకి చొరబడలేదు' అని పయ్యావుల అన్నారు.