గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 13 జనవరి 2020 (22:26 IST)

భిన్నత్వంలో ఏకత్వం భారత్ సొంతం: బిశ్వ భూషణ్ హరిచందన్

భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు విలక్షణమైనవని, ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం వెల్లివిరుస్తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, భావ ప్రకటన వంటి మంచి అవకాశాలను భారత రాజ్యాంగం అందించిందని ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రమే ఇటువంటి మోళిక సూత్రాలను ప్రజలకు అందించగలుగుతున్నాయని వివరించారు. “భారతదేశం గురించి తెలుసుకోండి” పేరిట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ యువజనాభ్యుదయ శాఖలు నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా భారతీయ సంతతికి చెందిన వివిధ దేశాల యువత సోమవారం విజయవాడ రాజ్ భవన్ దర్బార్ హాలులో గవర్నర్‌ను మర్యాద పూర్వకంగా కలిసారు. 
 
దశాబ్దాల క్రితం భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి భిన్న పరిస్థితులలో అయా దేశాలకు వలస వెళ్లిన వారి యువ సంతతికి భారతీయతను పరిచయం చేసే క్రమంలో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది.  భారతదేశంలోని వారి పూర్వీకుల మూలాలను తిరిగి గుర్తింప చేయటంతో పాటు, చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలు, స్మారక చిహ్నాలను సందర్శించేలా “భారత దేశం గురించి తెలుసుకోండి”  కార్యక్రమం అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భారతీయత పట్ల ఆసక్తితో ఫిజి, గయానా, మారిషస్, మయన్మార్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాడ్ , టొబాగో తదితర దేశాల నుండి యువత రావటం ముదావహమన్నారు.
  
రాష్ట్ర అధికారిక భాష తెలుగు "ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్"గా ప్రసిద్ది గాంచిందని, అధికశాతం ప్రజలు తెలుగు మాట్లాడతారని వివరించారు. జనాభాలో 70 శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉండగా, సారవంతమైన భూములు, సమృద్ధి నీటి వనరులతో ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా ఎపి పిలుపు నందుకుంటుందని, తగిన సహజ వనరులు, సాంస్కృతిక వారసత్వం, ఘన చరిత్ర రాష్ట్రం సొంతమన్నారు. పులిహోరా, గోంగురా పచ్చడి, బందర్ లడ్డు (తీపి) వంటి స్థానిక వంటకాలను రుచి చూడకుండా రాష్ట్ర పర్యటన పూర్తి కాబోదని ఇవి ఇక్కడ ఎంతో ప్రసిధ్ది నొందాయని పేర్కొన్నారు. 
 
974 కిలోమీటర్లతో దేశంలోనే రెండవ పొడవైన తీరప్రాంతం, ఆరు ఓడరేవులు ఎపి కలిగి ఉండగా సముద్ర ఉత్పత్తుల పరంగా దేశంలోనే అతిపెద్ద ఎగుమతిదారుగా ఉందన్నారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో నిలుస్తూ వస్తుందని, బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్స్ టైల్స్, లెదర్, ఆటోమోటివ్, ఆటో కాంపోనెంట్స్, వ్యవసాయ రంగాలలో గణనీయమైన పెట్టుబడి అవకాశాలను రాష్ట్రం కలిగి ఉందని గవర్నర్ వివరించారు. దేశంలో పట్టు ఉత్పత్తి చేసే 2 వ అతి పెద్ద రాష్ట్రం  ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని, కృష్ణ-గోదావరి బేసిన్‌లో అతిపెద్ద ఆఫ్‌షోర్ గ్యాస్ క్షేత్రాన్ని కలిగి ఉన్నామని భారతీయ సంతతికి వివరించారు. 
 
భారతదేశంలో 70 శాతం జనాభా 15 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలవారు కాగా, 21 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 479 ఇంజనీరింగ్ కళాశాలలు, 25 వైద్య కళాశాలలతో కూడిన విద్యా కేంద్రంగా ఎపి విలసిల్లుతుందన్నారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవల పరంగా ఎపి ముందంజలో ఉందని, వివిధ ఇ-గవర్నెన్స్ కార్యక్రమాల ద్వారా పౌర సేవలను సమర్థవంతంగా, పారదర్శకంగా అందించడానికి కృషి జరుతుందన్నారు.
 
సుపరిపాలన సూచికలో రాష్ట్రం ఐదవ స్థానంలో ఉండటం విశేషమన్నారు. దేశం మహాత్మా గాంధీ 150 వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో మీరంతా భారత పర్యటనకు రావటం ముఖ్యమైనదని, దేశ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో గాంధీజీ పాత్ర ఎనలేనిదని, అనేక మంది ప్రపంచ నాయకులకు ఆయన ప్రేరణగా నిలిచారని బిశ్వ భూషణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయిక్త కార్యదర్శి అర్జున రావు, యువజనాభ్యుదయ శాఖ సంచాలకులు నాగరాణి, భారత ప్రభుత్వం విదేశీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వినీత్ కుమార్, ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి డిఎస్ఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.