1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. APSDMA Warns of Severe Heat Waves in Several Mandals in Andhra

APSDMA: ఏపీలోని 28 మండలాల్లో వడగాలులు.. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి...

Summer Drinks
ఆంధ్రప్రదేశ్‌లోని పలు మండలాల్లో శనివారం నాడు తీవ్ర వడగాలుల పరిస్థితులు నెలకొంటాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్టీఎంఏ) హెచ్చరించింది. శ్రీకాకుళం- పార్వతీపురం మన్యం జిల్లాలతో సహా మొత్తం 14 మండలాలపై తీవ్ర వడగాలుల ప్రభావం పడే అవకాశం ఉంది. అదే సమయంలో విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లోని 28 మండలాల్లో వడగాలుల పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
 
ఉత్తర ఆంధ్ర- రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో, వడగాలులు, తీవ్రమైన వేడి, అధిక తేమ నుండి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. 
 
కాగా, శుక్రవారం నాడు రాష్ట్రంలోని 22 జిల్లాల్లోని 207 మండలాల్లో 41 డిగ్రీల సెల్సియస్ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు జైన్ పేర్కొన్నారు. నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలలో మన్యం జిల్లాలోని సాలూరులో 45.2 డిగ్రీలు, కర్నూలు జిల్లాలోని నందికొండలో 43.7 డిగ్రీలు, నంద్యాల జిల్లాలోని గోస్పాడులో 43.6 డిగ్రీలు, అనంతపురం జిల్లాలోని తెరణ్ణపల్లిలో 43.5 డిగ్రీలు ఉన్నాయి. 
 
విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, కడప జిల్లాలోని ఎర్రగుంట్లలలో ఉష్ణోగ్రత 43.4 డిగ్రీలకు, అనకాపల్లి జిల్లాలోని దేవరపల్లిలో 43.3 డిగ్రీలకు, మార్కాపురం జిల్లాలోని అనుములపల్లిలో 43.1 డిగ్రీలకు, అలాగే కాకినాడ జిల్లాలోని కరప మరియు తిరుపతి జిల్లాలోని బేస్తపల్లిలలో 42.9 డిగ్రీలకు చేరుకుంది. 
 
ఇంకా, పల్నాడు జిల్లాలోని గండిగనుమల, నెల్లూరు జిల్లాలోని కొమ్మిపాడులలో ఉష్ణోగ్రత 42.8 డిగ్రీలుగా, ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, పోలవరం జిల్లాలోని కునవరం, శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరులలో 42.7 డిగ్రీలుగా, అలాగే చిత్తూరు జిల్లాలోని రాయలపేటలో 42.5 డిగ్రీలుగా నమోదైంది. 
 
ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రక్షణ కవచాలు ధరించాలని, ఎండకు గురికాకుండా ఉండాలని, అలాగే నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, త్రాగునీటిని తగినంతగా సేవించాలని ఏపీఎస్టీఎంఏ సూచించింది. అదే సమయంలో, ఉరుములతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు రైతులు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని హెచ్చరించింది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
కేసీఆర్ మన మనిషి కాదు.. కనికరం లేని మరమనిషి... ముందుంది మొసళ్ల పండుగ : కుమార్తె కవిత ధ్వజం