మహిళలకు మరో శుభవార్త చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ.. ఆ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు ఏపీఎస్ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించవచ్చని వెల్లడించింది. మహాశివరాత్రికి రాష్ట్రంలోని అనేక శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ నడుపనుంది. ముఖ్యంగా, శ్రీశైలం, కోటప్పకొండలకు వందల సంఖ్యలో ఈ ప్రత్యేక బస్సులను నడిపేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ బస్సులోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది.
ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి పర్వదినం జరుగనుంది. ఆ రోజున భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సర్వీసులు నడుపనున్నారు. ప్రధానంగా పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ళకు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకోసం మొత్తం 618 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గత యేడాదితో పోలిస్తే ఈ సారి అదనంగా 70 సర్వీసులను అదనంగా నడుపుతామని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. అలాగే ప్రయాణిలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు వీలుగా 2 వేల మంది సిబ్బందిని విధుల్లో నియమించినట్టు తెలిపారు.
నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, అద్దంకి చీరాల డిపోల నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయని, ప్రయాణికుల సౌకర్యార్థం పెట్లూరివారి పాలెం వద్ద ప్రత్యేకంగా ఆర్టీసీ క్యాంపు కార్యాలయాన్ని కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులకు సంబంధించిన చార్జీల వివరాలను కూడా అధికారులు వెల్లడించారు. నరసరావుపేట నుంచి కోటప్పకొండకు రూ.30, కొండ దిగువ నుంచి పైకి రూ.25గా చార్జీని నిర్ణయించారు. అయితే, మహిళలు మాత్రం ఈ బస్సుల్లో ఎలాంటి చార్జీని చెల్లించకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు.