శుక్రవారం, 6 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 ఫిబ్రవరి 2026 (12:15 IST)

అరవ శ్రీధర్ వ్యవహారంలో పవన్‌ కల్యాణ్, జనసేనను లాగొద్దు.. మహిళా ఉద్యోగి

arava sridhar
arava sridhar
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన వ్యవహార బాధితురాలిగా పేర్కొంటున్న మహిళా ఉద్యోగి తాజా సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఈ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తున్నారని ఆరోపించింది. 
 
రాజకీయ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. తన వ్యక్తిగత అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగిస్తూ జనసేన పార్టీకి, ముఖ్యంగా పవన్ కల్యాణ్ ప్రతిష్ఠకు నష్టం కలిగించే ప్రయత్నం జరుగుతోందని ఆమె పేర్కొంది. రాజకీయం చేసి పవన్ కల్యాణ్ పేరు చెడగొట్టొద్దని ఆమె విజ్ఞప్తి చేసింది. పవన్ కల్యాణ్ నీతిగా జీవించే వ్యక్తి అని, బ్రోకర్ రాజకీయాల వల్ల ఆయనకు ఇబ్బందులు వస్తున్నాయని వ్యాఖ్యానించింది. 
 
తనకు, ఎమ్మెల్యేకు మధ్య జరిగిన విషయాలను పక్కనపెట్టి ఇతర అంశాలను కావాలనే లాగుతున్నారని ఆరోపించింది. ఒకటిన్నర సంవత్సరాలుగా తమ ఇద్దరి మధ్య జరిగిన విషయాలు తమకే తెలుసని, అందుకే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇప్పటివరకు బయటకు వచ్చి మాట్లాడటం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఇప్పటికే తన పరువు, వ్యక్తిగత జీవితం దెబ్బతిన్నాయని, ఈ ప్రచారం ఆగకపోతే మరింత నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. విచారణ జరిగితే నిజాలు బయటకు వస్తాయని ఆమె స్పష్టం చేసింది. తన సెల్‌ఫోన్‌తో పాటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సెల్‌ఫోన్‌ను పరిశీలిస్తే వాస్తవాలు స్పష్టంగా తెలుస్తాయని వ్యాఖ్యానించింది. తాను పారిపోలేదని స్పష్టం చేసింది. దమ్ము, ధైర్యం ఉంటే తనకు, ఎమ్మెల్యేకు మధ్య జరిగిన అంశాలపైనే మాట్లాడాలని ఆమె సవాల్ విసిరింది.