పురిటి నొప్పులు.. డోలీలో 8 కిలో మీటర్లు మోసుకెళ్లారు.. చివరికి ఏమైందంటే?
Updated: Sat, 3 Oct 2026 (14:35 IST)
అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాల కారణంగా గ్రామానికి వెళ్లే రహదారి దెబ్బతినడంతో, ఒక 27 ఏళ్ల గర్భిణీ స్త్రీని ఆసుపత్రికి చేర్చడానికి దాదాపు 8 కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకెళ్లాల్సి వచ్చింది. వివరాల ప్రకారం, గుడెం కొత్తవీధి మండలం, అమ్మరావి ధారకొండ పంచాయతీ పరిధిలోని తడకపల్లె గ్రామానికి చెందిన కొర్ర మంగరాజు భార్య దామినికి పురిటినొప్పులు మొదలయ్యాయి. ఆమెకు వైద్య సహాయం అవసరం కావడంతో, కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
అయితే, వర్షాల వల్ల తడకపల్లెకు వెళ్లే రహదారి దెబ్బతినడంతో, ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వేరే మార్గం లేకపోవడంతో, కుటుంబ సభ్యులు దామినిని డోలీలో సుమారు 8 కిలోమీటర్ల దూరం మోసుకుంటూ శ్యామగడ్డ వరకు తీసుకెళ్లారు. అక్కడి నుండి ఆమెను జీపులో చింతపల్లిలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో దామిని పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు.
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia....
మరింత చదవండి