ఆదివారం, 15 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

దిగ్విజయంగా సంకల్ప్ యాత్ర.. సీఎం చంద్రబాబును కలిసిన బండ్ల గణేశ్

bandla ganesh - babu
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ తాను చేపట్టిన సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. గత వైకాపా ప్రభుత్వంలో నాటి విపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు బనాయించి, అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో చంద్రబాబును గత వైకాపా ప్రభుత్వం ఏకంగా 52 రోజులకు పైగా రాజమండ్రి జైలులో బంధించింది. ఆ సమయంలో చంద్రబాబు క్షేమంగా, ఆరోగ్యంతో జైలు నుంచి విడుదల కావాలని బండ్ల గణేశ్ కోరుకుంటూ ఆ శ్రీవేంకటేశ్వర స్వామివారికి మొక్కుకున్నారు. 
 
ఆయన కోరుకున్నట్టుగానే చంద్రబాబు క్షేమంగా జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో బండ్ల గణేశ్ తన మొక్కు తీర్చుకునేందుకు సంకల్ప్ యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని షాద్ నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి 537 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలకు 23 రోజుల పాటు పాదయాత్ర చేసి దిగ్విజయంగా పూర్తి చేశారు. 
 
తిరుమలకు చేరుకున్న బండ్ల గణేశ్ శ్రీవారికి తలనీలాలు సమర్పించి, స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారికి మొక్కు తీర్చుకున్న తర్వాత ఆయన అమరావతిలోని ఏపీ అసెంబ్లీకి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి స్వామివారి తీర్థప్రసాదాలు అందచేశారు.