పుంగనూరు ఘటన వెనుక పెద్దిరెడ్డి కుటుంబం : ప్రత్యక్ష సాక్షిని నేనే : రామచంద్ర యాదవ్
చిత్తూరు జిల్లా పుంగనూరులో మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల సందర్భంగా జరిగిన దాడుల వెనుక వైకాపా నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిల కుట్ర ఉందని, అందుకు తానే ప్రత్యక్ష సాక్షిని అంటూ బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోభాగంగా నామినేషన్లు దాఖలు రోజైన తొలిరోజున జరిగిన దాడులకు పూర్తి బాధ్యత మిథున్ రెడ్డిదేనని, దానికి ప్రత్యక్ష సాక్షిని తానేనని ఆయన చెప్పారు.
ఈ దాడులపై ఆయన స్పందిస్తూ దీక్షలో ఉన్న తాను రాత్రి 12 గంటల సమయంలో మేడపైకి వెళ్లగా పక్కనే ఉన్న గెస్ట్ హౌస్లో మిథున్ రెడ్డి తన అనుచరులు, గూండాలతో సమావేశమై ఈ దాడులకు వ్యూహ రచన చేశారని ఆయన వెల్లడించారు. స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేసి ఎన్నికలు ముగిసేంత వరకు జైలులో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కుట్రపై సమగ్ర విచారణ జరిపి, పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులందరినీ అరెస్టు చేయాలని కోరారు. చంద్రబాబుకు పెద్దిరెడ్డి కుటుంబంతో లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు.
కాగా, శుక్రవారం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలి రోజే పుంగనూరు రణరంగంగా మారింది. నామినేషన్ దాఖలు చేసేందుకు వైకాపా నేతలు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారు. ఈ క్రమంలో వైకాపా, టీడీపీ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన వాహనాలు టీడీపీ కార్యకర్తలపైకి దూసుకొచ్చాయి. వైకాపా శ్రేణులు టీడీపీ కార్యకర్తలపై దాడికి దిగాయంటూ పలువురు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

