గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 8 మార్చి 2016 (13:02 IST)

తండ్రి అనుమతిస్తుంటే.. తనయుడు వసూళ్లు చేస్తున్నారు : బొత్స ఫైర్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌లపై వైకాపా నేత బొత్స సత్యనారాయణ విమర్శల వర్షం కురిపించారు. 'పెదబాబు శాంక్షన్.. చినబాబు కలెక్షన్' అనే పేరుతో తండ్రీకొడుకుల అవినీతి దందా సాగిపోతోందని విమర్శించారు. పలువురు తెలుగుదేశం నేతలు, మంత్రులు, నారా లోకేశ్‌లు రాజధాని భూములను అక్రమంగా కొనుగోలు చేశారంటూ వచ్చిన వార్తలపై బొత్స స్పందించారు. 
 
తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి పేరిట వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నదని విమర్శించారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారో ముందే ఒక నిర్ణయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు ఆ ప్రాంతంలో అమాయకుల నుంచి భారీగా భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. దీనిని పక్కా ఆధారాలతో తమ పార్టీ బయటపెడితే అదంతా అవాస్తవమని, రాజధానిని అడ్డుకునేందుకే వైసీపీ రాద్ధాంతం చేస్తోందని ఎదురుదాడి చేయడం విస్మయానికి గురిచేస్తోందన్నారు. 
 
అమరావతిలో రాజధానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని, రాజధాని పేరిట జరిగిన దోపిడీకి వ్యతిరేకంగానే తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు. తమ ఆరోపణలు అవాస్తవమైతే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన రవికుమార్‌ పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారని.. అమెరికాలో ఉంటున్న రవికుమార్‌కు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ వంటి ప్రాంతాల్లో కాకుండా అక్కడ వ్యవసాయ భూములు కొనాల్సిన అవసరం ఏమొచ్చిందని బొత్స ప్రశ్నించారు. 
 
అలాగే, మంత్రి నారాయణ సంస్థలో పనిచేస్తున్న ప్రమీల అనే చిరు ఉద్యోగి, మంత్రి బంధువైన సాంబశివరావు పేరిట భూములు కొనడం, మంత్రి రావెల కిశోర్‌బాబు భార్య శాంతిజ్యోతి పేరిట అసైన్డ్‌ భూములు కొనుగోలు చేయడం, ధూళిపాళ్ల నరేంద్ర పోరంబోకు భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడాలు వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. అసైన్డ్‌, పోరంబోకు భూములు కొనుగోలు తప్పుకాదా? అని ఈ వైకాపా నేత బొత్స ప్రశ్నించారు.