గురువారం, 12 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 ఫిబ్రవరి 2026 (13:56 IST)

బుల్లెట్ రైల్ ప్రాజెక్టుకు నవ్యాంధ్రకు గేమ్ ఛేంజర్ : రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

High Speed train
దేశంలో కొత్తగా చేపట్టనున్న బుల్లెట్ రైల్ ప్రాజెక్టు నవ్యాంధ్రకు గేమ్ ఛేంజర్ వంటివని కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్వని వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్లు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోవడంతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. 
 
కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఈ బుల్లెట్ రైళ్ల ప్రస్తావన చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా, హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై, హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు హైస్పీడ్ కారిడార్లు నిర్మించనున్నారు. ఈ కారిడార్ల నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నైకు 2.55గంటల్లో, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల్లో, బెంగళూరు నుంచి చెన్నైకి 1.13 గంటల్లో చేరుకోవచ్చని మంత్రి వెల్లడించారు. 
 
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాల వారీగా రైల్వే ప్రాజెక్టులకు జరిపిన కేటాయింపులను ఆయన సోమవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. హైస్పీడ్ రైల్ కారిడార్లు ఆర్థికవృద్ధి కారిడార్లుగా పనిచేస్తాయని.. విద్య, ఆరోగ్యం, వ్యాపార రంగాలను ప్రోత్సహిస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుల తుది ఎలైన్మెంట్ ఖరారు, డీపీఆర్ తయారీ జరుగుతోందని వెల్లడించారు. 
 
అహ్మదాబాద్ - ముంబై మధ్య తొలి ప్రాజెక్ట్ చేపట్టామని, ఇందులో అనుభవం సాధించడంతో రెండో దశలో దేశవ్యాప్తంగా ఏడు ప్రాజెక్టులు చేపట్టినట్లు చెప్పారు. ఈ రైళ్లు గంటకు 350 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయని, ఇవన్నీ ఎలివేటెడ్ కారిడార్లు కావడంతో కింద ప్రజలు తిరిగేందుకు ఇబ్బందులు ఉండవన్నారు. 
 
2026-27 బడ్జెట్ లో ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు రూ.10,134 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 2009-14 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రాష్ట్రానికి ఏటా రూ.886 కోట్ల చొప్పున కేటాయింపులు ఉండగా, ఈసారి బడ్జెట్లో దానికంటే 11 రెట్లు అధికంగా నిధులు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు.