శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (08:48 IST)

రాజధాని భూములు వెనక్కు?

రాజధాని గ్రామాల భూములను వెనక్కు ఇచ్చే అంశంపై ఫ్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి క్యాబినెట్లో చర్చ కూడా జరిగినట్లు సమాచారం. వైసిపి అధికారంలోకి వస్తే 'రాజధాని' భూముల తిరిగి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ఎన్నికల ప్రచార సభల్లో వైఎస్‌ జగన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అధికారంలోకి వచ్చాక పాలనా వికేంద్రీకరణ పేరుతో రాజధాని ప్రాంతంలో శాసన రాజధాని ఉంటుందని ప్రకటించారు. ఈ ప్రాంతంలోని భవనాలను, భూములను ఎలా వినియోగించుకోవలనేదానిపై సిఎస్‌ అధ్యక్షతన కమిటీ కూడా ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన క్యాబినెట్లో సమావేశంలోనూ భూముల వ్యవహారం చర్చకు రాగా ఆ కొన్ని గ్రామాల భూములను వెనక్కి ఇచ్చేస్తే ఎలా ఉంటుందనేదానిపై సమాలోచనలు చేసినట్లు తెలిసింది.

అయితే భూ సమీకరణ (ల్యాండ్‌పూలింగ్‌)లో ఒక నిర్ధిష్ట ప్రయోజనాల కోసం తీసుకున్న ఈ భూముల్లో కొన్నింటినే ఎలా వెనక్కు ఇవ్వాలనేదానిపై కసరత్తు చేయల్సివుది. ఈ ప్రక్రియలో చట్టపర చిక్కులు కూడా ఎదురయ్యే అవకాశముంది. వైసిపి అధికారంలోకి వచ్చిననాటి నుంచి కొన్ని గ్రామాల భూములను రాజధాని పరిధి నుంచి మినహాయించే దిశగా అడుగులేస్తోంది.

తొలుత ఉండవల్లి, పెనుమాకను తాడేపల్లి మున్సిపాలిటీలో కలిపింది. అనంతరం ఎర్రబాలెం, నిడమర్రు, కృష్ణాయపాలెం, కురగల్లు, బేతపూడి, నీరుకొండ గ్రామాలను మంగళగిరి మున్సిపాలిటీలో కలిపింది. నోటిఫికేషన్లు ఇచ్చి ప్రజాభిప్రాయం సేకరించింది.

జనవరిలో జరిగిన క్యాబనెట్‌ సమావేశంలో తాడేపల్లి, మంగళగిరి మండల పరిధిలోని గ్రామాలన్నీ కలిపి అతిపెద్ద కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని, దీనికి సంబంధించిన డిపిఆర్‌ సిద్ధం చేయాలని సిఎం ఆదేశించారు. ఇందుకోసం రూ.1100 కోట్లు నిధులు కేటాయించారు.

అయితే రాజధానిలో 34,400 ఎకరాలు భూములు పూలింగుకు ఇస్తే వాటిల్లో భూములు వెనక్కి ఇచ్చేయలని భావిస్తున్న గ్రామాల్లో దాదాపు 10 వేల ఎకరాలు ఉన్నట్లు రైతులు చెబుతున్నారు.