మహిళలకు మరో శుభవార్త.. ఏసీ బస్సులలో సైతం మహిళలకు ఉచిత ప్రయాణం
ఏపీ సీఎం చంద్రబాబు మహిళలకు మరో శుభవార్త చెప్పారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో నాలుగు వేలు, ఆరువేలు, పదివేలు, పదిహేను వేలు పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీనే అని అన్నారు. ఇప్పటి వరకూ 75 వేల 503 కోట్ల రూపాయలను పెన్షన్లు ఇచ్చామని.. ఆ డబ్బుతో మూడు పోలవరం ప్రాజెక్ట్‌లు కట్టవచ్చని వ్యాఖ్యానించారు.
ఆర్థిక అసమానతలు పోవాలని.. అందరికీ సంక్షేమం అందాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే కూటమి పనిచేస్తుందని అన్నారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పుకొచ్చారు. దీపం 2.0 ద్వారా ఏటా మూడు ఉచిత సిలిండర్లు, స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు.
మహిళలకు స్త్రీ శక్తి పథకంలో భాగంగా కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణంకు మంచి స్పందన వస్తుందని అన్నారు. మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. రాబోయే రోజులలో ఏసీ బస్సులలో సైతం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
