నాపై జరుగుతున్న విషప్రచారంపై కోర్టు గ్యాగ్ ఆర్డర్, తక్షణమే ఆ కంటెంట్ తొలగించాలి: బీఆర్ నాయుడు
తనపై జరుగుతున్న ప్రచారంపై తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు కోర్టుకు విన్నవించుకున్నట్లు తెలియజేసారు. దీని గురించి ఆయన X లో ఇలా పేర్కొన్నారు. టీటీడీ ఛైర్మన్‌గా నాపై జరుగుతున్న విషప్రచారంపై గౌరవనీయ హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేయడం జరిగింది. నాపై ఆధారరహిత, దుష్ప్రచార కథనాలను ఇకపై ప్రసారం లేదా ప్రచారం చేయకూడదని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రచురితమైన కథనాలను తక్షణమే తొలగించాలని కూడా పేర్కొంది.
అలాగే గూగుల్, ట్విట్టర్(X), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లకు సంబంధిత కంటెంట్‌ను డౌన్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తిరుమల ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా, ఏఐ మరియు మార్ఫింగ్ వీడియోల ద్వారా నాపై దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయి. సత్యం చివరకు గెలుస్తుంది. ధర్మం వైపు నిలబడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.