దళిత డ్రైవర్ హత్య - డోర్ డెలివరీ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య హస్తం.. అజ్ఞాతంలోకి...
గత వైకాపా ప్రభుత్వంలో 2022 మే నెల 19వ తేదీన జరిగిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, డోర్ డెలివరీ కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి లక్ష్మీ దుర్గ పాత్ర ఉన్నట్టు తాజాగా వెల్లడైంది. ఈ విషయం బయటకు పొక్కగానే ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయి, అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం బెయిలుపై విడుదలై బయటవున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ హత్య కేసులో ఆయన భార్య లక్ష్మీదుర్గకు కూడా సంబంధం ఉన్నట్టు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) అధికారులు నిర్ధారించారు.
ఈ హత్య కేసులో ఆమె కూడా పాల్గొన్నారని, ఆధారాలను ధ్వంసం చేశారని, డ్రైవర్ మృతదేహాన్ని కారులో ఎక్కించేందుకు సాయం చేశారని పేర్కొంటూ సిట్ బృందం రాజమండ్రి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన అనుబంధ చార్జిషీటులో పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ఆమె ఏ2గా ఉన్నారు.
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, తన వద్ద పనిచేసే డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని అనంతబాబు స్వయంగా కారులో తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గత యేడాది సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యలు విజ్ఞప్తి మేరకు జూలైలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన సిట్ అధికారులు పలు కీలక ఆధారాలను సేకరించారు. సీసీటీవీ ఫుటేజీ, కాల్ రికార్డులు, సాంకేతిక ఆధారాలను సేకరించారు.
ఈ అనుబంధ చార్జిషీటులో సిట్ అధికారులు తన పేరును ప్రస్తావించి ఏ2గా చేర్చడంతో లక్ష్మిదుర్గ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పైగా, ఈ కేసులో అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో అనంతబాబు గన్‌మెన్లు, అనుచరులను సిట్ అధికారులు ఇప్పటికే విచారించిన విషయం తెల్సిందే.