1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 1 మే 2016 (15:49 IST)

కోల్ స్కామ్‌ నుంచి 200 శాతం బయటపడతా.. పవన్‌తో సినిమా.. చిరంజీవి దగ్గరి బంధువు: దాసరి

కోల్‌స్కామ్‌కు సంబంధించి దర్శకరత్న దాసరి నారాయణ రావు స్పందించారు. తాను కోల్ స్కామ్ నుంచి వంద శాతం కాదు.. 200 శాతం బయటపడతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో చాలామంది ప్రముఖులున్నారని, తాను కేవలం సహాయ మంత్రినేనని తెలిపారు. కోల్‌స్కామ్‌లో తనపై బురదచల్లడం సరికాదని.. ఈ వ్యవహారంలో ప్రధాన మంత్రి కార్యాలయానిదేనని దాసరి నారాయణ వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, దాసరి సినిమాలపై కూడా స్పందించారు. తాను పెద్ద హీరోలతో సినిమా చేయలేనేమోననే అనుమానం వ్యక్తం చేశారు. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ఓ సినిమాను నిర్మిస్తానని దాసరి వ్యాఖ్యానించారు. ఈ సినిమా ఓ పొలిటికల్ సెటైర్‌గా ఉంటుందన్నారు. పవన్ కల్యాణ్ ఎప్పటికీ గ్రేటేనని.. కమిట్‌మెంట్ ఉన్న వ్యక్తని కితాబిచ్చారు. 
 
తనకు, మెగాస్టార్ చిరంజీవిల మధ్య వివాదాన్ని మీడియానే సృష్టిస్తోందన్నారు. సందర్భానుసారంగా వచ్చే కామెంట్లను అతిగా చూపిస్తుందే తప్ప తనకు చిరంజీవితో విభేదాలు లేవన్నారు. చిరంజీవి తనకు దగ్గరి బంధువని స్పష్టం చేశారు. తెలుగు సినీ రంగంలో ఎందరో వారసులు తెరంగేట్రం చేశారని.. నిజానికి తనకు అసలైన వారసుడు మోహన్ బాబేనని చెప్పారు. దర్శకత్వంలో హీరోల ప్రమేయం అధికం కావడం పరిశ్రమకు అంత మంచిది కాదని దాసరి వ్యాఖ్యానించారు.