పోలీస్ నియామక పత్రం అందుకున్న శిరీష మాటలకు డిప్యూటీ సీఎం పవన్ భావోద్వేగం (video)
కానిస్టేబుల్ నియామకాల పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోం మంత్రి అనిత పాల్గొన్నారు. మొత్తం 6100 మందికి నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లాకు చెందిన శిరీష అనే యువతి మాట్లాడుతూ... మా తల్లిదండ్రులకు మేము ఇద్దరం ఆడపిల్లలం. ఆర్థికంగా వెనుకబడ్డవారం. మమ్మల్ని చదివించడానికి మా తల్లిదండ్రులు ఎంతో శ్రమపడ్డారు.
వారు మమ్మల్ని చదివిస్తుంటే... ఎందుకురా ఆడపిల్లల్ని చదివిస్తున్నావ్ అనేవారు మా గ్రామంలో కొందరు. ఐతే మా నాన్న వారి మాటలను పట్టించుకోకుండా మమ్మల్ని ఎంతో కష్టపడి చదివించారు. మా నాన్న ఓ కౌలు రైతు, వ్యవసాయం చేస్తూనే పాలు అమ్మి మమ్మల్ని చదివించారు. అలా మా అమ్మానాన్న ఆరోజు పడిన కష్టానికి ఈరోజు నేను కానిస్టేబుల్ నియామక పత్రాన్ని అందుకుంటున్నాను. మాకు నియామక పత్రాలు అందించిన సీఎం గారికి ధన్యవాదాలు అని అన్నారు. శిరీష చెప్పిన మాటలకు స్టేజిపైన వున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భావోద్వేగానికి లోనైనట్లు కనబడుతోంది.