ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న నిరంతర యంత్రం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్రానికి భారీ నిధులు
ఆయన సత్యంలోని అగ్ని కణం. ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్న నిరంతర యంత్రం. విమర్శించేవాడు సైతం పక్కకెళ్లి లెంపలేసుకునే వ్యక్తిత్వం. ఆయన మరెవరో కాదు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.
కోట్లు ఆర్జించే మార్గమున్నా, ప్రజాసేవకు తన జీవితాన్ని, ఆంధ్ర రాష్ట్ర పల్లె, పట్టణ, నగరాలు దేశానికే మార్గదర్శం కావాలన్న ఆరాటం ఆయనలో అహరహం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా, అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి గ్రామీణ పరిపాలన, పర్యావరణ పరిరక్షణలో కీలకమైన మార్పులు తీసుకువచ్చారు.
తాజాగా వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవిక మిషన్ (VB-GRAM) కింద రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయింపయ్యాయి. ఈ నిధులలో...
రాష్ట్ర వాటా: ₹5,138 కోట్లు
కేంద్ర వాటా: ₹7,707 కోట్లు
మొత్తం వ్యయం: ₹12,845 కోట్లు
నిధుల సాధనలో దేశంలో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్
జులై 1 నుంచి అమల్లోకి రానున్న ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది. ప్రజల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా కేంద్రంతో సమన్వయం చేస్తూ రాష్ట్రానికి గరిష్ఠ ప్రయోజనాలు తీసుకొస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలుపుతూ గడిచిన కాలంలో ఆయన సాధించిన ముఖ్యమైన విజయాలు, తీసుకొచ్చిన సంస్కరణలను అవలోకనం చేద్దాము.
జాతీయ స్థాయిలో నంబర్-1 గుర్తింపు (5 జాతీయ అవార్డులు)
పవన్ కల్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శన కనబరిచింది. గతంలో 24వ స్థానంలో ఉన్న ఏపీ పంచాయతీరాజ్ శాఖను ఆయన దేశంలోనే మొదటి స్థానానికి తీసుకువెళ్లారు. కేంద్ర ప్రభుత్వం నుండి 'రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్', 'జల్ సంచయ్ - జన్ భాగీదారి' విభాగాల్లో ఏపీ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం మీద రాష్ట్రం 5 ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను (రెండు ప్రథమ, ఒక ద్వితీయ, రెండు తృతీయ బహుమతులు) గెలుచుకుంది.
'పల్లె పండుగ' - గ్రామీణ మౌలిక వసతులు
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం 'పల్లె పండుగ 1.0', '2.0' కార్యక్రమాలను చేపట్టారు. దీని కింద సుమారు ₹6,700 కోట్ల వ్యయంతో దాదాపు 53,000 అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామాల్లో 4,000 కిలోమీటర్లకు పైగా సిమెంట్ (CC) రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఉపాధి హామీ (MGNREGA) పథకం కింద రైతులకు మేలు చేసేలా లక్షకు పైగా వ్యవసాయ చెరువుల నిర్మాణానికి పునాది వేశారు.
ఒకే రోజు 13,326 గ్రామ సభలు (ప్రపంచ రికార్డు)
గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం కల్పిస్తూ, పవన్ కల్యాణ్ చొరవతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని 13,326 గ్రామ పంచాయతీలలో ఒకే రోజు (ఆగస్టు 23, 2024న) గ్రామ సభలు నిర్వహించారు. ఉపాధి హామీ నిధుల వినియోగంపై ప్రజల భాగస్వామ్యంతో తీర్మానాలు చేసినందుకు గానూ ఈ కార్యక్రమం 'వరల్డ్ రికార్డ్స్ యూనియన్'లో స్థానం సంపాదించుకుంది.
'అమరజీవి జలధార' తాగునీటి ప్రాజెక్ట్
గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి ₹7,910 కోట్ల భారీ బడ్జెట్‌తో 'అమరజీవి జలధార' (వాటర్ గ్రిడ్) ప్రాజెక్టును వేగవంతం చేశారు. దీని ద్వారా 2027 నాటికి 1.21 కోట్ల మంది ప్రజలకు ఇంటింటికీ టాప్ కనెక్షన్ ద్వారా రక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
అడవుల సంరక్షణ- 'హనుమాన్' (HANUMAN) ప్రాజెక్ట్
వన్యప్రాణుల రక్షణ: అడవుల్లో జంతువులు, మనుషుల మధ్య ఘర్షణలను తగ్గించడానికి, వన్యప్రాణులను కాపాడటానికి అధునాతన సాంకేతికతతో కూడిన HANUMAN (Healing and Nurturing Units for Monitoring Aid & Nursing of Wildlife) ప్రాజెక్ట్‌ను అమలులోకి తెచ్చారు. (ఉదాహరణకు: పంటలను నాశనం చేసే అడవి ఏనుగులను అదుపు చేయడానికి కుమ్కీ ఏనుగులను రంగంలోకి దించడం).
అడవి తల్లి బాట: మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ కల్పించడానికి ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డుకట్ట వేశారు. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ కఠినమైన చర్యలు తీసుకున్నారు. 2047 నాటికి రాష్ట్రంలో గ్రీన్ కవర్‌ను 33% నుండి 50% కి పెంచేలా ప్రణాళికలు రూపొందించారు.
పంచాయతీ నిధుల బదిలీ & ఉద్యోగుల ప్రమోషన్లు
గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పంచాయతీ నిధుల సమస్యను పరిష్కరిస్తూ, 15వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి విడుదల చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న 10,000 మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి వారిలో నూతనోత్సాహాన్ని నింపారు.
పవన్ కల్యాణ్ తన నియోజకవర్గమైన పిఠాపురంలోని అనాథ పిల్లల సంరక్షణ కోసం తన శాసనసభ్యుని (MLA) జీతాన్ని పూర్తిగా విరాళంగా ఇస్తూ ఆదర్శంగా నిలిచారు. పవన్ కల్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ సాధించిన జాతీయ స్థాయి విజయాలు, అవార్డుల పరంపర సాగుతూ వుంది.
