ఆదివారం, 8 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 4 ఫిబ్రవరి 2026 (16:29 IST)

తిరుమల లడ్డు కల్తీ, సైజు తగ్గిందని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు: రమణదీక్షితులు

Ramanadeekshitulu on Tirumala Laddu
తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కల్తీ నెయ్యి మాట అటుంచి అసలు లడ్డూ తయారీలో నెయ్యినే వాడలేదనీ, అది కేవలం సింథటిక్ ఘీ అంటే రసాయనాలతో తయారైన నెయ్యి అంటూ సిట్ నివేదికలో తేలడంతో తిరుమల శ్రీవారి లడ్డూ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు శ్రీవారి లడ్డూ విషయమై చెబుతున్న విషయాలు మరింత చర్చకు దారితీస్తున్నాయి.
 
దీక్షితులు గారు మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ గురించి తను ఎన్నోసార్లు లడ్డూ నాణ్యతపైనా, సువాసన లేదనీ, పరిమాణం తగ్గిపోయిందని చెప్పినా పట్టించుకోలేదని విమర్శించారు. భక్తులకు తిరుమల లడ్డూ అంటే ఎంత పవిత్రమైనదిగా భావించి సేవిస్తుంటారు. అట్లాంటి లడ్డూ కల్తీ అయ్యింది. ఆ కల్తీ లడ్డులను స్వామివారికి నైవేద్యంగా పెట్టాల్సి రావడం మా జీవితంలో మర్చిపోలేని తీవ్రమైన బాధగా మిగిలింది. 
 
లడ్డూ నాణ్యత ఒక్కటే కాదు, శ్రీవారికి నైవేద్యంగా సమర్పించాల్సిన దిట్టం కూడా తగ్గించేసారు. దిట్టంలో వుండాల్సినంత నైవేద్యం పెట్టకుండా తగ్గించేయడంపై కూడా ఆనాడు ప్రశ్నించాను. నాది ఒంటరి పోరాటంగా మిగిలిపోయింది. తను కైంకర్యాలు చేసేటపుడు గరుడ సేవనాడు సుమారుగా 100 గంగాళాలకు తగ్గకుండా స్వామివారికి నైవేద్యం సమర్పించేవారు. అట్లాంటిది పరిమాణం తగ్గించేసారు.
 
ఇది ఆగమ శాస్త్రానికి విరుద్ధం. నైవేద్యంగా వున్న ప్రసాదాన్ని స్వామి వారికి సమర్పించినప్పుడు దాని సారాన్ని స్వామివారు గ్రహించి అనుగ్రహాన్ని భక్తులకు ఇస్తారు. తద్వారా అతివృష్టి, అనావృష్టి, కరవు, యుద్ధాల భయం, రోగ భయం తదితర సమస్యలు దరిచేరవు. దేశం సుభిక్షింగా వుంటుందని ఆయన చెప్పారు. తాజాగా ఆలయ ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యలతో కల్తీ లడ్డు వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న చర్చ జరుగుతోంది.