జగన్ మరోమారు అధికారంలోకి రాలేరు : విజయసాయి రెడ్డి
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మరోమారు అధికారంలోకి రాలేదని ఆ పార్టీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. మద్యం స్కామ్‌లో ఈడీ అధికారుల ఎదుట ఆయన గురువారం హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి మరోమారు అధికారంలోకి రాలేదు. టీడీపీ కూటమిని ముక్కలు చేస్తేనే జగన్‌కు మరోమారు సీఎం అయ్యే అవకాశం ఉంది. తన చుట్టూ ఉన్న కోటరీని నమ్ముకుంటే మరోమారు అభాసుపాలు కాకతప్పదు అని అన్నారు.
పైగా, తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోలేదన్నారు. జూన్ తర్వాత తన రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడుతానని చెప్పారు. 'అధికారంలోకి వచ్చిన కొత్తలో నాకు నెంబర్-2 స్థానం ఇచ్చారు. పనికిమాలిన కోటరీ వల్ల మెల్లగా బయటకు వచ్చా. నా దురదృష్టం వల్ల జగన్ కూడా కోటరీ మాటలు నమ్మారు. 2020 నుంచి నన్ను సైడ్‌లైన్ చేశారు. పార్టీ నుంచి ఎందుకు వెళ్లారని నన్ను ప్రశ్నించారు. మద్యం స్కామ్ అనేదాన్ని నేను నమ్మడం లేదని చెప్పా. నేను రూ.వందల కోట్లు సంపాదించానని కోటరీ ఆరోపణలు చేసింది.
నా కుమార్తెను ఇచ్చినంత మాత్రాన ఆ ఆస్తులన్నీ నావి కావు. విశాఖలో ఆస్తులు సంపాదించానని నాపై దుష్ప్రచారం చేశారు. నా ఆస్తులని రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకొంటానని చెప్పా. విశాఖలో ఒక్క అపార్ట్‌మెంట్ తప్ప నాకేమీ లేదు. నాపై దుష్ప్రచారం చేసిన వారికి సరైన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నా. నాకు సంబంధంలేని విషయాల్లో నన్ను ఇరికించారు.
విజయసాయిరెడ్డి భయపడే వ్యక్తి కాదు. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదని గ్రహించాలి. నేను రాజకీయాల నుంచి విరమించుకోలేదు. రాజకీయాల్లో స్ట్రాటజీ ఉండాలి.. అలాగే ముందుకెళ్లాలి. ఏడాదిగా నేను వ్యవసాయం చేసుకుంటున్నా. అప్పుడప్పుడు ట్వీట్లు మాత్రమే పెట్టా. నేను ఎవరినీ విమర్శించలేదు.. జగనే నన్ను విమర్శించారు.
విజయసాయి ఎవరి వద్ద చెయ్యి చాచడు. నాపై చేసిన వ్యాఖ్యలను జగన్ విత్‌డ్రా చేసుకోవాలి. జగన్ వద్ద నేను పాలేరులా పనిచేశా. కోటరీ మాటలు నమ్మి పొగబెట్టి బయటకు పంపించారు. నా సమాధానాలు కొన్నింటిని ఈడీ అధికారులు రికార్డు చేశారు. మరి కొన్ని సమాధానాలు మాత్రం రికార్డు చేయలేదు. మద్యం స్కామ్ జరిగిందా? లేదా? అని అడిగారు. నాకు తెలియదని చెప్పా. ఆ స్కామ్‌లో ఉన్నవారినే అడగాలని చెప్పా.
నెంబర్-2 మీకు తెలియదా అని అడిగారు. ప్రాంతీయ పార్టీల్లో నెంబరు-2 స్థానం ఉండదు. నెంబరు-2 అని నాపై ముద్రవేశారు. కేసుల విషయంలో నేను నెంబర్-2 అవుతాను. లాభాల విషయంలో మాత్రం నా స్థానం వంద తర్వాతే. నన్ను మళ్లీ విచారణకు పిలుస్తారని అనుకుంటున్నా' విజయసాయిరెడ్డి తెలిపారు.