ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 మార్చి 2026 (12:31 IST)

రాజమండ్రి కల్తీపాలనో ఇథలీన్ గ్లైకాల్ - తాగితే కిడ్నీలో పాడైపోవాల్సిందే..

milk
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిన రాజమండ్రి కల్తీ పాల మరణాల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో పది మంది చనిపోయారు. వీరు సేవిన పాలలో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు కలిసివున్నట్టు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. 
 
ఈ ఘటనపై విచారణ జరిపిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్), రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఆర్ఎఫ్ఎస్ఎల్) తమ తుది నివేదికలను సమర్పించాయి. బాధితులు తాగిన పాలలో పారిశ్రామిక అవసరాలకు వినియోగించే 'ఇథలీన్ గ్లైకాల్' అనే రసాయనం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ కెమికల్ శరీరంలోకి వెళితే కిడ్నీలను పూర్తిగా దెబ్బతీస్తుందని నివేదికలో పేర్కొన్నారు.
 
ఈ విషపూరిత రసాయనం కారణంగా బాధితుల కిడ్నీలతో పాటు శరీరంలోని ఇతర ముఖ్య అవయవాలు కూడా విఫలమయ్యాయి. దీంతో ఇప్పటివరకు 10 మంది మరణించగా, మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వారి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
 
ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాల వ్యాపారి అడ్డాల గణేశ్వరరావుపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినందుకు అతనిపై ఇప్పటికే 9 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తుండగా, నిత్యం వినియోగించే పాల నాణ్యతపై ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.