రాజమండ్రి జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశా... అదొక శిక్షణా కేంద్రం : అంబటి రాంబాబు
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును దూషించిన కేసులో అరెస్టయిన వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన బుధవారం రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబుపై నమోదైన 36 కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అలాగే, పోలీస్ విధులకు ఆటంకాలు, వివిధ వివాదాలపై మరో 16 కేసులు నమోదైవున్నాయి. ఈ కేసుల్లో కూడా ఆయనకు బెయిల్ మంజూరైంది. అలాగే, గత వైకాపా ప్రభుత్వంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల పేరుతో నిర్వహించిన లక్కీ డ్రా అవినీతి కేసులో కూడా ఆయనకు బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
ఆ తర్వాత ఆయన జైలు బయట విలేకరులతో మాట్లాడుతూ, జైలు జీవితాన్ని ఎంజాయ్ చేసినట్టు చెప్పారు. జైలులో పెడితే భయపడతానని అనుకున్నారేమో... అలాంటి ప్రసక్తే లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైలులో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. జగన్ నాయకత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంతవరకు తన పోరాటం ఆగదన్నారు. పైగా, రాజమండ్రి కేంద్ర కారాగారం తనలో పట్టుదలను పెంచిన శిక్షణా కేంద్రమన్నారు.