ఆంధ్రలో రూ 40,000 కోట్ల హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన: అనంత్ అంబానీ ప్రసంగం
మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా RIL ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అనంత్ M అంబానీ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ... గౌరవనీయులైన కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు, వేదికపై ఉన్న ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, గౌరవనీయులైన అతిథులు మరియు నా ప్రియమైన రైతు సోదర సోదరీమణులారా - ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశపు అన్నదాతలారా, మహిళలు మరియు పెద్దలందరికీ, "అందరికీ నమస్కారం".
మీ అందరికీ నా గౌరవపూర్వక నమస్కారాలు. శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, భారత ఆర్థిక వ్యవస్థను మీరు నడిపిస్తున్న తీరు యువ పారిశ్రామికవేత్తలకు భవిష్యత్తు కోసం నిర్మాణాలు చేపట్టేలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది. నేడు, ₹40,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న 'రాయలసీమ హార్టికల్చర్ హబ్', భారతదేశ వృద్ధికి సంబంధించిన నూతన కాంతిని రాయలసీమకు తీసుకువస్తోంది.
పవన్ కళ్యాణ్ గారు, బలమైన పంచాయతీలు, గ్రామీణాభివృద్ధి పట్ల మీకున్న అంకితభావం ఈ పాఠశాల యొక్క ఉద్దేశ్యానికి సరిగ్గా సరిపోతుంది. పర్యావరణం పట్ల మీకున్న బాధ్యత, వ్యవసాయం విజయవంతం కావాలంటే దానికి ఆధారమైన భూమిని మరియు నీటిని కూడా కాపాడుకోవాలని మనకు గుర్తుచేస్తోంది.
చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు నాకు రెట్టింపు గౌరవ భావం కలుగుతోంది. మొదటిది, మదనపల్లెలో భారతదేశపు మొట్టమొదటి హై-టెక్, అత్యంత ఆధునిక మరియు నిజంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన 'స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్'ను మీరు ఏర్పాటు చేస్తున్న ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించే అవకాశం కల్పించినందుకు మీకు కృతజ్ఞతలు. రెండవది, పాతికేళ్ల క్రితం మీరు హైదరాబాద్‌కు 'ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్' (ISB)ను తీసుకువచ్చారు. నేడు, మీరు భారతీయ రైతుకు వారి స్వంత ISBని అందిస్తున్నారు.
భారతదేశం ప్రపంచానికి ఎంతోమంది CEOలను అందించింది. కానీ ISA (ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్) భారతీయ రైతును తన పొలానికి స్వయంగా CEOగా మారుస్తుంది. అరేబియా సముద్ర తీరంలో ఒకరు, బంగాళాఖాత తీరంలో మరొకరు - ఇలా ఇద్దరు దూరదృష్టి గల, అత్యంత వినూత్నమైన ఆలోచనలు కలిగిన ముఖ్యమంత్రులను భారతమాత అందించినట్లు చరిత్ర నమోదు చేస్తుంది. గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీ గారు గుజరాత్‌ను సమూలంగా మార్చివేశారు.
ఇప్పుడు మీరు కూడా అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ను మారుస్తున్నారు. మీ చైతన్యవంతమైన నాయకత్వంలో, ఆంధ్ర భూమి 'స్వర్ణ భూమి'గా మారుతోంది. వాస్తవానికి, శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టితో కూడిన నాయకత్వంలో నేడు భారతదేశంలోని ప్రతి ప్రాంతం అపూర్వమైన మార్పులకు లోనవుతోంది. 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) కలను సాకారం చేయడానికి, నాలాంటి యువ భారతీయులు అత్యంత అంకితభావంతో మరియు నిబద్ధతతో పనిచేస్తామని నిర్మలా జీకి, నాయుడు గారికి మరియు మీ ద్వారా మన ప్రధానమంత్రి గారికి నేను హామీ ఇస్తున్నాను. గాంధీ జయంతి సందర్భంగా మనం ఈ రోజు ఒక సంకల్పం తీసుకుందాం: "వికసిత్ భారత్ కలను మేము కచ్చితంగా సాకారం చేసి చూపిస్తాం."
గౌరవనీయులైన పెద్దలకు మరియు ప్రియ మిత్రులకు, 1919లో, సరిగ్గా ఇదే మదనపల్లె పట్టణంలో, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ మన జాతీయ గీతాన్ని భారతదేశపు 'ప్రభాత గీతం' (morning song)గా ఆంగ్లంలోకి అనువదించారు. నేడు, మదనపల్లె భారతీయ రైతు కోసం ఒక కొత్త ప్రభాత గీతాన్ని ఆలపిస్తోంది. మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్' (భారతీయ వ్యవసాయ పాఠశాల) స్థాపించబడుతోంది.
భారతదేశం తన గ్రామాల్లోనే నివసిస్తుందని జాతిపిత చెప్పిన మాట అక్షరాలా నిజం. ఆయన మనకు 'సర్వోదయ' మరియు 'అంత్యోదయ' అనే మంత్రాలను అందించారు. ప్రతి రైతుకు వ్యవసాయం లాభదాయకంగా మరియు సామాజికంగా గౌరవప్రదమైన వృత్తిగా మారినప్పుడే ఈ మంత్రం నిజమైన అర్థాన్ని సంతరించుకుంటుంది. శాస్త్రి గారు దేశానికి "జై జవాన్, జై కిసాన్" అనే గొప్ప నినాదాన్ని అందించారు. అటల్ జీ దానికి 'జై విజ్ఞాన్'ను జోడించారు. మోదీ జీ 'జై అనుసంధాన్'ను (పరిశోధన) జోడించారు. ఈ పాఠశాలలో ఆ నాలుగూ ఒకే చోట కలుస్తాయి: "జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్."
సాంకేతికత ద్వారా రైతుల ఆదాయం పెరగాలని చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఆ లక్ష్యమే 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్'కు మూలస్తంభం. గౌరవనీయ సహోదరులారా మరియు మిత్రులారా, ఇక్కడ ఈ పాఠశాలలో, కృత్రిమ మేధస్సు భారతదేశంలోని కష్టపడి పనిచేసే రైతుల సాంప్రదాయ మేధస్సుతో కలవబోతోంది. ఈ పాఠశాలలోని యువ మేధావులు, తెగుళ్ల దాడి వ్యాపించక ముందే రైతులను హెచ్చరించగల తెలివైన సాధనాలను అభివృద్ధి చేయడాన్ని ఊహించండి. పంట ఆరోగ్యాన్ని మ్యాప్ చేసి, నీరు మరియు పోషకాల ఖచ్చితమైన వినియోగానికి మార్గనిర్దేశం చేయగల డ్రోన్లను. కష్టమైన పనిని సులభతరం చేసి, నష్టాలను తగ్గించగల రోబోటిక్స్‌ను. క్లౌడ్ కంప్యూటింగ్ రైతులకు సకాలంలో సలహాలను అందించి, 'ప్రతి బొట్టుకు ఎక్కువ పంట' సాధించడంలో సహాయపడుతుంది.
మదనపల్లె టమాటా రైతుకు ఎప్పుడు, ఎక్కడ అమ్మాలో చెప్పే ధరల నిఘా వ్యవస్థను. గ్రీన్హౌస్ టెక్నాలజీ ఒక సతత హరిత విప్లవానికి శక్తినివ్వగలదు: ఇక్కడ వ్యవసాయం సంవత్సరంలో 365 రోజులు, రోజుకు 24 గంటలు వర్ధిల్లుతుంది. రిలయన్స్ యొక్క హరిత ఇంధన వ్యాపారాల ద్వారా, మన అన్నదాతలను ఊర్జదాతలుగా మార్చడానికి ఒక అవకాశం నాకు కనిపిస్తోంది. భారతదేశ ఆహార భద్రతను నిర్ధారించే మన రైతులు, ఇప్పుడు భారతదేశ ఇంధన భద్రతను కూడా బలోపేతం చేస్తారు – తద్వారా ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మారుస్తారు.
అందుకే, రాష్ట్రంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ₹1 లక్ష కోట్లు పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ కృతజ్ఞతలు తెలుపుతోంది. రాబోయే దశాబ్దాలలో ఇవి 3 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించి, రాష్ట్రానికి దాదాపు ₹60,000 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడతాయి.
ప్రముఖ నాయకులు మరియు అతిథులారా, మన రైతులను మరింత సుసంపన్నం చేయడం, మన ఇంధనాన్ని మరింత స్వచ్ఛంగా మార్చడం, మరియు జంతువుల పట్ల మన శ్రద్ధను మరింత బలోపేతం చేయడం నా ధ్యేయంగా భావిస్తున్నాను. ఈ ధ్యేయానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవడానికి మరియు రిలయన్స్ సామర్థ్యాలను వినియోగించడానికి నేను ఇక్కడికి వచ్చాను. 2001లో, మా తాతగారు శ్రీ ధీరూభాయ్ అంబానీ 'మన వ్యవసాయ ఉత్పత్తిలో అనేక రెట్ల పెరుగుదల' గురించి కలలు కన్నారు. 25 సంవత్సరాల తరువాత, ఈ పాఠశాల ఆ కలను నిజం చేయడానికి సహాయపడగలదు. మనం కలిసి పనిచేయబోయే నాలుగు ఆచరణాత్మక మార్గాలను నేను పంచుకుంటాను. ఈ ఆలోచనలు మా గౌరవనీయ తండ్రిగారు శ్రీ ముఖేష్ అంబానీతో జరిపిన చర్చల నుండి వచ్చాయి. ఆయన నిర్మలాజీ, నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మొదటిది: ఈ పాఠశాల రైతుల ఇంటి వద్దకే చేరాలి.
అందువల్ల, జియో (JIO) ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌తో కలిసి, గ్రామాలలో వర్చువల్ తరగతి గదుల ద్వారా మీ శిక్షణా మాడ్యూళ్లను భారతీయ భాషలలో మరియు ఇంటరాక్టివ్ పద్ధతిలో లక్షలాది మంది రైతులకు అందించడానికి సహకరిస్తుంది. విద్యావంతులైన గ్రామీణ యువత డిజిటల్ సామర్థ్యం గల విస్తరణ కార్యకర్తలుగా (DIGITALLY ENABLED EXTENTION WORKERS) మారి, ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో రైతులకు సహాయపడగలరు.
రెండవది: జియో (JIO) 'జియో కృషి' (JIO KRISHI) అనే కొత్త వేదికను సృష్టించింది. జియో కృషి రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు అనేక వినూత్న ఉత్పత్తులను అభివృద్ధి చేసింది. జామ్‌నగర్‌లో, మేము బయో-ఎనర్జీ డెవలప్మెంట్ కోసం భారతదేశంలోనే అత్యంత ఆధునిక ఆర్&డి కేంద్రాన్ని స్థాపించాము. మా జ్ఞానాన్ని మీతో పంచుకోవడాన్ని... మరియు మీ నుండి నేర్చుకోవడాన్ని మేము దేశ సేవ మరియు కిసాన్ సేవగా భావిస్తాము.
మూడవది: నేను ముందుగా పశు సేవకుడిని, ఆ తర్వాతే ఒక పారిశ్రామికవేత్తను. నా వరకు, పశు సేవ అంటే ప్రభు సేవ కూడా. మరియు ఇది భారతదేశానికి కూడా ఒక ప్రతీక అని నేను నమ్ముతాను. మన రైతులు పశు సేవ యొక్క విలువను మరియు భారతదేశపు అమూల్యమైన పశు ధనాన్ని అర్థం చేసుకున్నారు. జంతువుల పట్ల మన సాంప్రదాయ ప్రేమ మరియు శ్రద్ధతో పాటు, అత్యాధునిక పశుపోషణ మన గ్రామాలలో అపారమైన కొత్త సంపదను మరియు ఉపాధిని సృష్టించగలదని నేను నమ్ముతున్నాను. జామ్‌నగర్‌లోని వంతరలో, మేము వన్యప్రాణి మరియు పశువైద్య శాస్త్రాల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి గ్లోబల్ యూనివర్సిటీకి పునాది వేశాము. మీ పాఠశాలకు, మా విశ్వవిద్యాలయానికి మధ్య సన్నిహిత సంబంధాన్ని నెలకొల్పడానికి మేము సంతోషిస్తాము.
నాలుగవది: భారతీయ యువత గర్వంగా ఎంచుకునే వృత్తిగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దడంలో ఈ పాఠశాల సహాయపడగలదు. ఆదాయం అనిశ్చితంగా ఉండటం మరియు అవకాశాలు పరిమితంగా అనిపించడం వల్ల చాలా మంది యువకులు వ్యవసాయ రంగాన్ని వదిలివేస్తున్నారు. వారి సొంత గ్రామాల్లోనే విజయవంతమైన భవిష్యత్తును నిర్మించుకునేందుకు అవసరమైన నైపుణ్యాలు, సాంకేతికత మరియు వ్యాపార సామర్థ్యాలను వారికి కల్పిద్దాం.
గౌరవనీయులైన నాయకులు, సోదర సోదరీమణులారా, నాయుడు గారూ, మీ ప్రభుత్వం అనుసరిస్తున్న 'వ్యాపార నిర్వహణ వేగం' (Speed of Doing Business), ఆంధ్రప్రదేశ్ ఆశయాలను అద్భుతమైన పెట్టుబడుల ప్రవాహంగా మారుస్తోంది. జూన్ 2024 నుండి, రాష్ట్రం 388 భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా ₹14 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రానుండగా, దాదాపు 11 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడింది; ఇందులో మూడింట ఒక వంతు వాటా రాయలసీమకే దక్కనుంది. ఈ ప్రయాణంలో భాగస్వామి కావడం రిలయన్స్‌కు గర్వకారణం- ముఖ్యంగా రాయలసీమలోనే చేపట్టిన స్వచ్ఛ ఇంధన (clean energy) ప్రాజెక్టుల ద్వారా.
హరిత ఇంధనం (green energy) నుండి అధునాతన తయారీ రంగం వరకు, ఈ పురోగతి 'వికసిత్ భారత్' లక్ష్యానికి అనుగుణంగా ఉన్న మీ 'స్వర్ణాంధ్ర 2047' దార్శనికతకు నిజమైన బలాన్ని చేకూరుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు రైతులతో కలిసి 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్' నిర్మాణంలో తమ వంతు చిన్న సహకారాన్ని అందించినందుకు రిలయన్స్ గర్విస్తోంది. వ్యూహాత్మక పెట్టుబడులు, డిజిటల్ సామర్థ్యాలు, సాంకేతిక నైపుణ్యం మరియు పరిశ్రమల భాగస్వామ్యాల ద్వారా రిలయన్స్ ఈ సంస్థకు తన మద్దతును కొనసాగిస్తుంది.
గౌరవనీయులైన శ్రీ చంద్రబాబు నాయుడు గారూ, ఈ రోజు నేను మిమ్మల్ని ఒక విన్నపం చేస్తున్నాను. నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి. రిలయన్స్‌పై నమ్మకం ఉంచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఈ చారిత్రాత్మక ప్రయత్నంలో భాగస్వాములు కావాలని మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. ఈ రోజు మనం కేవలం శంకుస్థాపనలు మాత్రమే చేయడం లేదు. గ్రామీణ ఉపాధి కల్పన, బలమైన గ్రామాలు, సుస్థిరమైన భారతదేశం మరియు అన్నింటికంటే ముఖ్యంగా మన రైతుల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం మనం పునాదులు వేస్తున్నాం.
అందరికీ ధన్యవాదాలు.
ఆంధ్రప్రదేశ్ కోసం మనం కలిసి పనిచేద్దాం. స్వర్ణాంధ్రాన్ని నిర్మిద్దాం!
అందరికీ ధన్యవాదాలు.
జై ఆంధ్ర. జై హింద్. జై కృష్ణ. గోవిందా.
