శుక్రవారం, 23 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 13 డిశెంబరు 2025 (23:49 IST)

ఆయన అద్భుతంరా బుజ్జీ: డిప్యూటీ సీఎం పవన్ దాతృత్వంపై ప్రశంసలు

pawan kalyan
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రపంచ కప్ గెలిచిన మహిళల అంధుల క్రికెట్ జట్టును అభినందించారు. తనవంతు సాయంగా క్రికెటర్లకు ఒక్కొక్కరికి 5 లక్షలు, కోచ్‌లకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున విరాళంగా ఇచ్చారు. పుట్టుకతోనే జీవితంలో ఓ ఛాలెంజ్ తో పుట్టారనీ, దాన్ని అధిగమించి ఈ స్థాయికి వచ్చినవారికి వెన్నుదన్నుగా నిలవాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
 
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదారత ముందు ఎవ్వరూ సాటిరారని మరోసారి రుజువైందని ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఆయన సీఎస్ఆర్ సహాయంతో క్రీడాకారుల ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కార్యాలయం అన్ని రాష్ట్రాల సంబంధిత ముఖ్యమంత్రులను సంప్రదించి మద్దతును అందిస్తుందని ఈ సందర్భంగా మహిళా క్రికెటర్లకు భరోసా ఇచ్చారు.
 
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్దకు ఒక సమస్య వెళితే దానికి తక్షణ పరిష్కారం లభిస్తుంది. ఆయన ఏదైనా హామీ ఇస్తే గంటల వ్యవధిలో నెరవేరుతుంది. ఈ తరహా సదాభిప్రాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఇపుడు క్రమక్రమంగా నెలకొంటోంది. వరల్డ్ కప్ భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక చేసిన విజ్ఞప్తిపై డిప్యూటీ సీఎం పవన్ కొన్ని గంటల వ్యవధిలో స్పందించారు. ఆమె స్వగ్రామానికి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. పరిపాలనలో తనదైన వేగాన్ని చూపిస్తూ, ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే పనులు ప్రారంభమయ్యేలా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 
 
తాజాగా తన స్వగ్రామమైన అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం, అమరాపురం మండలం, హేమావతి పంచాయతీ పరిధిలోని తంబలహెట్టికి సరైన రోడ్డు మార్గం లేక గ్రామస్థులు ఇబ్బందులను దీపిక తాజాగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె వినతిని స్వీకరించిన పవన్ కళ్యాణ్ రోడ్డు వేయిస్తానని అక్కడికక్కడే హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. రోడ్లను పరిశీలించి నిర్మాణానికి సంబంధించిన అంచనాలను సిద్ధం చేశారు. హేమావతి నుంచి తంబలహెట్టి వరకు రోడ్డు నిర్మాణానికి రూ3.2 కోట్లు, గున్నేహళ్లి నుంచి తంబలహెట్టి వరకు 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు అవసరమని అధికారులు నివేదిక ఇచ్చారు. 
 
ఈ అంచనాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణం ఆమోదం తెలిపి, మొత్తం రూ.6.2 కోట్ల నిధులను మంజూరు చేశారు. అడిగిన వెంటనే హామీ ఇవ్వడమే కాకుండా, గంటల వ్యవధిలోనే నిధులను మంజూరు చేయడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.