చుక్కేసి చిక్కితే ఉద్యోగం కూడా ఊడుతుంది... హైదరాబాద్ పోలీసుల సరికొత్త అస్త్రం
డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో చుక్కేసి చిక్కితే ఉద్యోగం కూడా ఊడగొట్టేలా హైదరాబాద్ నగర్ ట్రాఫిక్ పోలీసులు సరికొత్త అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పటిటవరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడితే, కేసు, కౌన్సెలింగ్, జరిమానా, కొన్ని కేసుల్లో జైలుశిక్షలు విధించారు. ఇప్పటివరకు ఈ తరహా శిక్షలను మాత్రమే అమలు చేస్తూ వచ్చారు. దీంతో అనేక మంది మద్యం బాబులు ఈ శిక్షలను లైట్‌గా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉదాసీనతను వదిలించేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు కొత్త అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు.
డ్రంక అండ్ డ్రైవ్‌లో చిక్కిన వారి వివరాలను వారు పనిచేసే సంస్థల యాజమాన్యానికి పంపాలని నిర్ణయించారు. ఇప్పటివరకు కేవలం పోలీసులతో గొడవలు, జైలుశిక్షలు పడిన వారి సమాచారం మాత్రం చేరవేసే వారు. ప్రమాదాల కట్టడే లక్ష్యంతో ఇటీవల ఎరైవ్ -ఎలైవ్ కార్యక్రమం చేపట్టారు. ప్రతిరోజూ 15-20 ప్రాంతాల్లో తనిఖీలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు.
అతివేగం, మద్యం కారణంగానే అధిక ప్రమాదాలు జరుగుతున్నట్టు అంచనాకు వచ్చారు. ఈ క్రమంలోనే మత్తులో వాహనాలు నడిపితే కొలువులకు ఎసరు తప్పదనే సంకేతం పంపనున్నారు. నగర సీపీ సజ్జనర్ ఆదేశాలతో మార్చి నుంచి అమలుకు ట్రాఫిక్ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. తనీఖీల్లో చిక్కిన సమయంలోనే వారు పనిచేస్తున్న సంస్థ వివరాలు, చిరునామా సేకరించనున్నట్టు తెలిసింది.
చాలామందిలో తాము ఎంతతాగినా వాహనం నడపగలమనే ధీమా ఉంటుంది. కానీ మెదడుపై మద్యం ప్రభావం తీవ్రంగా ఉంటుందని గ్రహించరు. తమపై ఆధారపడి కుటుంబం ఉందనే విషయం మర్చిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే వారి వివరాలను ఆయా కంపెనీలకు పంపాలనే ఆలోచన చేస్తున్నాం. ఉద్యోగం, పరువు పోతాయనే భయంతోనైనా మద్యం తాగి వాహనం నడపకుండా ఉండే అవకాశం ఉంటుంది.