సంబంధిత వార్తలు
- హ్యాక్ టు ది ఫ్యూచర్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను రూపొందించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
- మోటార్లకు మీటర్లు అమర్చినా.. ఉచిత విద్యుత్ నిలిపివేసినట్టు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయం : సీఎం రేవంత్ సవాల్
- డైరెక్టర్ రవిచరణ్ రెండవ చిత్రం నవాబ్ సిద్ధం, జూన్ లో జెన్ జి గర్ల్స్ ప్రారంభం
- దర్శకరత్న దాసరి సమాధిని శుభ్రం చేసిన మంచు మనోజ్
- అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...
తెలంగాణ ప్రజలకు చల్లని కబురు : మరో పది రోజుల్లో నైరుతి రుతుపవనాల ప్రవేశం
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మరో 10 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది. జూన్ 10వ తేదీ నుంచి 12వ తేదీల మధ్య తెలంగాణాలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఎండల తీవ్రత తగ్గి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రస్తుతం కేరళ, దాని పరిసర ప్రాంతాల్లో విస్తరించిన ఈ నైరుతి రుతుపవనాలు మరో నాలుగైదు రోజుల్లో తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. ఆ తర్వాత మరో పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాల కారణంగా రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతున్నాయని అధికారులు తెలిపారు. లక్షద్వీప్, కొమోరిన్ ప్రాంతం నుంచి ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవనాలు ఇప్పటికే విస్తరించివున్నట్టు ఐఎండీ వెల్లడించింది.
రుతుపవనాల రాకతో రాష్ట్రంలో ఎండల తీవ్రత, వడగాల్పులు క్రమంగా తగ్గుముఖం పడతాయని అధికారులు తెలిపారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లా దేహాగాన్‌లో రికార్డు స్థాయిలో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ రానున్న రాజుల్లో ఉపశమనం లభించనుంది. జూన్ 1వ తేదీ నుంచి హైదరాబాద్ నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 36-38 డిగ్రీలకు ఇతర జిల్లాల్లో 40-42 డిగ్రీల వరకు తగ్గుతాయని ఐఎండీ అంచనా వేసింది. జూన్ 5వ తేదీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 38-39 డిగ్రీల మధ్య స్థిరపడనున్నాయి. కాగా, ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
