పిఠాపురంలో చిన్నపిల్లలు కొట్టుకుంటే పెద్ద వార్త చేస్తారు కానీ సొంత బాబాయి హత్య..: పవన్ ఆగ్రహం
పిఠాపురంలో సంక్రాంతి సంబరాలలో పాల్గొనేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే అయిన పవన్ కల్యాణ్ వెళ్లారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా తనకు ఎన్నో బాధ్యతలు వున్నప్పటికీ తను ప్రాతినిధ్యం వహించే పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని అన్నారు. ఇప్పటివరకూ రూ. 308 కోట్లను నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించినట్లు తెలిపారు.
పిఠాపురంలో ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టించేందుకు వైసిపి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. తనను పిఠాపురంలో ఓడించేందుకు చిత్తూరు నుంచి నాయకులు వచ్చి పనిచేసారని గుర్తు చేసారు. ఇక్కడ ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకుంటే దాన్ని పెద్దవార్త చేసేందుకు ప్రయత్నించారు. ఏదో చిన్నపిల్లలు మాటామాటా అనుకుని కొట్టుకుంటే దాన్ని పెద్ద వార్త చేస్తారు, అదే పులివెందులలో సొంత బాబాయి హత్యకు గురైతే అదసలు వార్తే అవ్వదని వైఎస్ జగన్ పైన పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు.
ప్రభుత్వం మారినా, ప్రజలు తీర్పు ఇచ్చినా ఆ పార్టీలో మాత్రం ఎంతమాత్రం మార్పు రావడం లేదని అన్నారు. నిరంతరం ఏదో ఒక వివాదం సృష్టించాలని చూడటం తప్పించి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకుందాం... ఏం చేస్తే మనం బాగుపడతాం అనే ఆలోచన వారికి లేదని అన్నారు. ప్రజలు వారి కుట్రల్లో చిక్కకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. వారి మాటలను నమ్మి ఎట్లాంటి వివాదాల్లోకి పోవద్దని అన్నారు.