సంబంధిత వార్తలు
- ప్రతిపక్ష పార్టీలు మహిళలకు వ్యతిరేకమా? జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ
- మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు ఏం సాధించాయి.. జగన్
- విపక్షాలది మహిళా వ్యతిరేక మైండ్‌సెట్ : అమిత్ షా
- ప్రధాని మోడీకి నాకు భార్యలు లేరు... సో మాకు సమస్య లేదు : రాహుల్ గాంధీ
- డీలిమిటేషన్ బిల్లు ముసుగులో రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర : రాహుల్ గాంధీ
బీజేపీతో అక్రమ సంబంధం బయటపడింది... జగన్ గారి తెర తొలగింది : వైఎస్ షర్మిల
వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన సొంత చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీతో జగన్ అక్రమ సంబంధం బయటపడిందని, జగన్ గారి తెర తొలగిందంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పరిరక్షణ కంటే బీజేపీ భజనే జగన్‌కు ముఖ్యమా అంటూ ఆమె ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన అక్రమ డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు పలికినందుకు జగన్ సిగ్గుపడాలని అన్నారు.
శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన మహిళా బిల్లుకు, మరో రెండు అనుబంధ బిల్లులకు వైకాపాకు చెందిన ఎంపీలు మద్దతు పలికారు. ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని జగన్‌పై షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తన ఐదేళ్ల పాలనలో చేసిన అవినీతి, కేసుల నుంచి రక్షణ పొందేందుకే జగన్ బీజేపీకి బానిసగా మారారని షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు.
'కేసుల నుంచి రక్షణ కోసం బానిసగా బ్రతకాలా? బీజేపీ బిల్లులకు గొర్రెలా గుడ్డిగా తలాడించాలా? మోడీ మెప్పుకోసం సొంత కాకిలెక్కలు అల్లాలా?' అని నిలదీశారు. మహానేత వైఎస్ఆర్ సిద్ధాంతాలను, విలువలను జగన్ మంటగలిపారని, దీనిపై ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగానికి విఘాతం కలిగించే బిల్లును విపక్షాలు అడ్డుకుంటే, ఆ బిల్లును అడ్డుకోవడం ద్వారా ఏం సాధించారని జగన్ ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఈ దొంగ బిల్లుకు ఓటేసి జగన్ ఏం సాధించారని, కోట్లాది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను గాయపరిచారని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌కు ముడిపెట్టడం జగన్ అవివేకానికి నిదర్శనమని షర్మిల అన్నారు. మహిళల 33 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ సహా ఎవరూ వ్యతిరేకం కాదని, కానీ బీజేపీ ప్రభుత్వం దాని అమలును ఆలస్యం చేసేందుకే డీలిమిటేషన్, జనాభా లెక్కలు అనే నిబంధనలు పెట్టిందని ఆరోపించారు.
మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై తమ పార్టీ వైఖరి స్పష్టంగా ఉందని తెలిపారు. 2026 జనాభా లెక్కలు, కులగణన పూర్తయ్యాక, ఆ గణాంకాల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం చేస్తూ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రస్తుతమున్న 543 లోక్సభ స్థానాలకే మహిళా రిజర్వేషన్లను వర్తింపజేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోందని వివరించారు.
అధికారిక గణాంకాలు లేకుండానే సీట్లు పెంచి దేశాన్ని ఉద్దరిస్తున్నామని బీజేపీ చెబితే, జగన్ గుడ్డిగా నమ్మడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని షర్మిల అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని, ఈ మూడు పార్టీలూ మోడీ మెప్పుకోసమే పనిచేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నది తామేనని ఆమె పేర్కొన్నారు.
