మదనపల్లె ఆస్పత్రిలో అనాథ శవంగా కులవర్థన్ మృతదేహం... చూసేందుకు రాని కన్నతల్లి
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల మైనర్ బాలిక హత్యాచారం కేసులోని నిందితుడు కులవర్థన్ (30) బుధవారం ఉదయం ఓ చెరువులో మృతదేహమై కనిపించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కులవర్థన్ మృతదేహం అనాథ శవంలావుంది. తన కుమారుడు మృతదేహాన్ని చూసేందుకు కన్నతల్లితో పాటు కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రావడం లేదు. పైగా, అతనితో తమకు ఎలాంటి సంబంధం లేదని మృతుడి సోదరి స్పష్టం చేసింది. దీంతో కులవర్థన్ అంత్యక్రియలను మున్సిపల్ సిబ్బందే నిర్వహించనున్నారు.
ఈ కేసు నేపథ్యం ఇదీ...
మదనపల్లికి చెందిన ఏడేళ్ల బాలిక తాగా హత్యకు గురైన విషయం తెల్సిందే. ఇంటి పక్కనే ఉన్న కులవర్ధన్ అనే వ్యక్తి చిన్నారికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి, కిరాతకంగా హత్య చేసి డ్రమ్ములో కుక్కాడు. ఈ హత్యా విషయం వెలుగులోకిరావడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున మహిళలు, ప్రజలు ఆందోళనకు దిగారు. నిందితుడిని తమకు అప్పగించాలని లేదా ఎన్‍కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ ఆందోళన మధ్య బాలిక మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పోస్టుమార్టం నివేదికలో బాలిక లైంగికదాడికి గురైనట్టు వెల్లడైంది. ఈ ఘటన తర్వాత పరారీలో ఉన్న నిందితుడు కులవర్థన్ కోసం పోలీసులు గాలిస్తుండగా, ఓ చెరువులో నిందితుడి మృతదేహం లభ్యమైంది. మదనపల్లి సమీపంలోని ముదివేడు మండలం కనసానిపల్లి చెరువులో మృతదేహాం కనిపించింది. స్థానికులిచ్చిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.