శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 జనవరి 2016 (09:09 IST)

మళ్లీ టీడీపీ వైపు చూస్తున్న మైసూరారెడ్డి? చంద్రబాబు అనుమతి ఎదురుచూపులు!

వైకాపా సీనియర్ నేత మైసూరా రెడ్డి తిరిగి తెలుగుదేశం పార్టీవైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీపై మైసూరాలో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ వైసీపీ వర్గాల్లో అవుననే సమాధానమే వినిపిస్తోంది. నిజానికి వైసీపీ నుంచి రాజ్యసభ సీటు ఆశించిన మైసూరారెడ్డి… ఈ విషయంలో జగన్ తనను మోసం చేశారని ఎంతగానో ఆవేదన చెందుతున్నారు. 
 
అందుకే గతకొన్నాళ్లుగా ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తనకు ఇవ్వాల్సిన సీటును తన సన్నిహితుడైన విజయసాయిరెడ్డికి ఇవ్వాలని జగన్ నిర్ణయించడం మైసూరాకు ఆగ్రహం కలిగించింది. దీంతో కొన్నాళ్లుగా జగన్ పార్టీకి దూరంగా ఉన్న ఆయనను మళ్లీ టీడీపీలోకి తీసుకొచ్చేందుకు కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత, చంద్రబాబు సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. 
 
దీనికి కారణం కూడా లేకపోలేదు. మైసూరా రెడ్డి ద్వారా జగన్‌ మోహన్ రెడ్డికి చెక్ పెట్టొచ్చన్న భావనలో వున్న టీడీపీ అధిష్టానం… సీఎం రమేశ్ ప్రయత్నాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మైసూరాకు కావాలంటే ఎమ్మెల్సీ సీటు ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో కడపలోని ఆయన నియోజకవర్గమైన కమలాపురం నుంచి మైసూరాను బరిలోకి దింపాలని టీడీపీ భావిస్తోందని… ఇందుకోసం ముందుగానే ఆయనను పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.