మంత్రి లోకేశ్ అమెరికా పర్యటన - టెక్ దిగ్గజాలతో వరుస భేటీలు
ఏపీ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనలో బిజీబిగా గడుపుతున్నారు. తన పర్యటనలో భాగంగా పలువురు టెక్ దిగ్గజ కంపెనీల సీఈవోలను వరుసగా కలుసుకుంటూ, ఏపీలో తమతమ కంపెనీల ఏర్పాటుపై చర్చలు జరుపుతున్నారు. తాజాగా శాన్‌ఫ్రాన్సిస్కోలో గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్‍తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అలాగే డ్రోన్ సిటీలో అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటుచేయాలని కోరారు.
మరోవైపు, ఇంటెల్ ఐటీ సీటీవో శేష కృష్ణపురతోనూ మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. ఏపీలో ఇంటెల్ ఏటీఎంపీ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అమరావతిలో ఇంటెల్ ఏఐ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు.
ఎన్ విడియా ప్రతినిధి రాజ్‌మిర్ పురితో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఏపీలో ఎన్ విడియా స్మార్ట్ ఫ్యాక్టరీ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించాలని కోరారు. భాగస్వామ్య సంస్థలు పెట్టుబడులు పెట్టేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అడోబ్ సీఈవో శంతను నారాయణ్ భేటీ అయ్యారు.
ఏపీలో అడోబ్ జీసీసీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. జూమ్ ప్రెసిడెంట్ శంకరలింగంతో మంత్రి సమావేశమై ఏపీలో జూమ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆయా సంస్థల ప్రతినిధులు హామీ ఇచ్చారు.