ఏపీలో టీం 11 ఉంది.. అర్థమైందా రాజా? అదో ఏడుపుగొట్టు టీం : మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీం 11 అనే జట్టు ఒకటి ఉందని, ఆ జట్టు ముఖం చూసి ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారా అంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఇటీవల జ్యూరిచ్‌కు వెళ్లారు. అక్కడ ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, ఏపీలో ఉన్న టీం 11 ముఖం చూసి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని ప్రశ్నించారు. పెట్టుబడులు కోసం తాము ప్రయత్నిస్తుంటే ఏపీకి రావొద్దని ఆ ఏడుపుగొట్టు టీం కంపెనీలకు ఈమెయిల్స్ పెడుతోందని ఆరోపించారు.
కోడికత్తి, బాబాయ్ హత్య, ప్రజాధనంతో ప్యాలెస్ కట్టుకున్న క్రెడిట్ మాత్రమే వారికి దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబును చూసి ఏ కంపెనీ అయినా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే ఆ క్రిడిట్ ఏడుపుగొట్టు టీం తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
మళ్లీ క్రెడిట్ చోరీ అంటారు. టీం 11 ముఖం చూసి ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? కోడికత్తికి వారికి క్రెడిట్ ఇవ్వాలి. బాబాయిని లేపేసిన క్రెడిట్ ఇవ్వాలి. చెల్లినీ, తల్లినీ గెంటేసిందనకు క్రెడిట్ ఇవ్వాలి. రూ.700 కోట్ల ప్రజాధనంతో విశాఖలో ప్యాలెస్ కట్టుకున్న క్రెడిట్ ఏడుపుగొట్టు టీంకు ఇవ్వాలని అంటూ లోకేశ్ సెటైర్ల వర్షం కురిపించారు.