సోమవారం, 16 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 16 ఫిబ్రవరి 2026 (22:48 IST)

పవన్ సార్, నా చేయి విరిగింది చూడండి, ప్లీజ్ మా ఊరికి రోడ్డు వేయండి: విద్యార్థి వీడియో

Boy request to pawan kalyan
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పరిధిలోని రాజపురం గ్రామం నుంచి కమలాయిపుట్టుగ గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం పూర్తి అధ్వాన్నంగా వుందనీ, ఆ దారిన వెళ్తుంటే ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే పిల్లలు సైకిళ్లపై వెళ్తున్నప్పుడు రోడ్డుపై వున్న గతుకులకు కిందపడిపోయి దెబ్బలు తగులుతున్నాయి. దీనిపై ఓ బాలుడు వీడియో ద్వారా.. పవన్ సార్, రోడ్డు బాగాలేనందువల్ల సైకిల్ పైనుంచి కిందపడి చేయి విరిగింది. దయచేసి మా ఊరికి రోడ్డు వేయండి సార్ అంటూ వెల్లడించాడు.
 
రోడ్డు అధ్వాన్నంగా వుండటం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రహదారి ద్వారా సుమారు 1000 మంది విద్యార్థులు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు. గర్భిణులు, వృద్ధులు సైతం రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. సుమారు 4 కిలో మీటర్ల రహదారి పరిధిలో ( కవిటి, ఇచ్చాపురం మండలాలు)రాజపురం, కమలాయిపుట్టుగ, ఇన్నీసుపేట, ఎ. బలరాంపురం, లండ పుట్టుగ గ్రామాల ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామాల ప్రజానీకం తమకు రోడ్డుమార్గం వేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి విజ్ఞప్తి చేస్తున్నారు.