తుని చిన్నారి అదృశ్యం కేసులో పెంపుడు కుక్క మృతి, మరింత అనుమానం, వీడియో
కాకినాడ జిల్లా తుని చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసులో చిన్నారితో పాటు మూడు రోజులు కనిపించకుండా పోయి తిరిగి వచ్చిన పెంపుడు కుక్క మృతి చెందింది. కుక్క మృతితో ఈ కేసు విషయంలో మరిన్ని అనుమానాలు వెల్లడవుతున్నాయి. చిన్నారి తప్పిపోయినప్పుడు ఆ బాలిక వెంట కుక్క కూడా వెళ్లిపోయింది. 3 రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చింది. తిరిగి వచ్చిన దగ్గర్నుంచి ఆ కుక్క ఒకింత విచిత్రంగా ప్రవర్తిస్తోంది. ఇంతలో పోలీసులు చిన్నారి ఆచూకిని తెలుసుకునేందుకు కుక్కకి జిపిఎస్ పరికరం అమర్చారు. ఐతే కుక్క మాత్రం సమీప ప్రాంత పొలాలు చుట్టూ రెండురోజులుగా తిరిగింది. చివరికి ఈరోజు మెలికలు తిరుగుతూ కన్నుమూసింది.
బ్రేకింగ్ న్యూస్
— Rahul (@2024YCP) June 13, 2026
కాకినాడ: చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసులో కుక్క మృతి
చిన్నారి వెంట వెళ్లి తిరిగొచ్చిన పెంపుడు కుక్క
రెండు రోజులు విచిత్రంగా ప్రవర్తించిన కుక్క
కుక్క మృతిచెందడంతో పలు అనుమానాలు pic.twitter.com/2J9BbW3Edk
అసలేం జరిగింది?
కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన గణేష్, భవానీ దంపతుల మూడేళ్ల కుమార్తె జ్ఞానేశ్వరి గత శనివారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటూ పెంపుడు కుక్కతో సహా అదృశ్యమైంది. పాప అదృశ్యమైన గంటల్లోనే ఆమె ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్ కెమేరాల సాయంతో పోలీసులు సైతం జల్లెడ పడుతున్నప్పటికీ చిన్నారి ఆచూకి లభించలేదు.
ఐతే మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో పాపతో పాటు అదృశ్యమైన పెంపుడు కుక్క తిరిగి వచ్చింది. ఆ కుక్క నేరుగా పాప తల్లి వద్దకు వెళ్లి చీరను లాగుతూ ఒకింత ఆందోళనగా కనిపించింది. అక్కడ నుంచి తిరిగి అది తోటలోకి పరుగులు తీసింది. దాంతో ఆ కుక్కను అనుసరిస్తూ పోలీసులు గాలిస్తున్నారు. సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలోని జీడి తోటలు, కొండ ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో పాప కోసం వెతుకుతున్నారు. ఇప్పటివరకూ చిన్నారి ఆచూకి లభించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
