తితిదే ఉద్యోగి నుంచి నన్ను రక్షించండి అయ్యా సీఎం గారూ, డిప్యూటీ సీఎం గారూ: బాధితురాలు వీడియో
అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అయ్యా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు నన్ను రక్షించండి అంటూ ఓ మహిళ వీడియోలో కన్నీటిపర్యంతమవుతూ వేడుకుంటూ వుంది. తనను హత్య చేసేందుకు తితిదేలో ఉద్యోగిగా వున్న తన భర్త క్రాంతికుమార్‌తో పాటు మరో ఇద్దరు నిత్యం వెంబడిస్తున్నారనీ, నన్ను అంతమొందిస్తారనే భయం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ... టిటిడి నాకు ఇచ్చిన షాపును అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు చూస్తున్నారు. నాకు, నా బిడ్డకు వున్న ఏకైక జీవనాధారాన్ని లాక్కోవాలని చూస్తున్నారు. నాకు తీవ్రమైన ప్రాణహాని వుంది. నాపై కారుతో దాడి చేసి చంపేయాలని చూస్తున్నారు. నన్ను ఢీకొట్టారు, స్కూటీపై వెళుతున్న నేను కిందపడిపోయాను. చూడండి గాయాలు.
దయచేసి నాకు భద్రత కల్పించండి. నా భర్తకు నాకు మధ్య మనస్పర్థల కారణంగా అతడికి దూరంగా వుంటున్నాను. అతడు మరో మహిళను పెళ్లి చేసుకుని తిరుచానూరులో వుంటున్నాడు. ఐతే ఇప్పుడు నాకు తితిదే ఇచ్చిన షాపును స్వాధీనం చేసుకోవాలని కొన్నిరోజులుగా నన్ను వేధిస్తున్నాడు. తితిదే ప్రొసీడింగ్స్ వెంటనే పూర్తి చేయించేలా ఆదేశాలు ఇచ్చి నన్ను ఆదుకోండి అంటూ ఆమె కన్నీటిపర్యంతమవుతూ చెప్పింది.